22, జులై 2021, గురువారం

శ్రీహరినామము చేయనివానికి చిత్తశాంతి కలదా

శ్రీహరినామము చేయనివానికి చిత్తశాంతి లేదు
శ్రీహరినామము చేసెడివానికి చెడిపోవుట లేదు

రామనామమును రుచిమరగినచో రక్తిముక్తి కలవు
కామునిమైత్రిని మరగినచో బహుకష్టములే కలవు

రామరామయని పలికేవానికి రామరక్ష కలదు
రామునిలేడని పలికేవానికి రక్షకు డెట గలడు

శ్రీహరిపై మమకార ముంచిన చింతలు నిను వదలు
దేహముపై మమకార ముంచిన దీనతయే మిగులు

రాముని మారుతివలె కొలిచినచో బ్రహ్మపదము కలుగు
రాముని రావణువలె తిట్టినచో రావణుగతి కలుగు

హరిభక్తులతో కలసితిరిగిన హరికృప సిధ్ధించు
హరివిద్వేషుల కలసితిరుగుట అధోగతికి దించు 

పరమానందము రామనామమని భావించిన ముక్తి
పరమానందము నెఱుగడు కాముని భావించిన వ్యక్తి

హరిసంసేవన కంకితమైతే హరిపదమును చేరు
నరులసేవకే యంకితమైతే నరకమునే చేరు

హరిని తలచిన చిత్తశాంతితో హాయిగొనును నరుడు
హరిని మరచితే చిత్తశాంతికై యలమటించు నరుడు