1, జులై 2021, గురువారం

ఇచట భోగించవలె

ఇచట భోగించవలె నెంత పుణ్యమున్న నీ
విచట ననుభవించవలె నే పాపఫలమైన

పొంది స్వర్గమును నీవు పుణ్యముల మూలమున
నందు చేయువిహారంబు లవి బహుమతులు
అందాల స్వర్గవాస మనుభవించి పుణ్యము
బొందితో భోగించగ భూమికి రావలయును

చేసినట్టి పాపములకు శిక్షగా నరకమున
గాసి నొందు చటుల కొంత కాలము పిదప
నీసురో మనుచు మెక్క నీ భువికి రావలెను
చేసుకున్న వాటి కిటుల చెల్లువేయ వలయును

భూమికిట్లు రప్పించెడు పుణ్యపాపాలేల
రామనామముండ నీకీ రాపిడి యేల
కామిత మొక మోక్షమే కావున శ్రీరాముని
యేమరక నీవు సేవించుటే ముఖ్యము