18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

భక్తిసముద్రంలో ప్రజాయుధ్ధనౌక మునిగిపోతేనేమీ?


ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో రంగనాయకమ్మ గారి వ్యాసం ఒకటి  భక్తి సముద్రంలో మునిగిపోయిన ‘ప్రజాయుద్ధ నౌక' అన్న శీర్షికతో వచ్చింది.

ఈమధ్య గద్దర్ గారి ధోరణిలో కొట్టవచ్చినట్లు కనిపించిన మార్పు ప్రజానీకానికి ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవం. అయన దైవసంకీర్తనం చేస్తూ టీవీలో కనిపిస్తారని కలలో కూడా మనం ఊహించలేదు కదా.

రంగనాయకమ్మ గారు ఆశ్చర్యపోయి ఊరుకోలేదు మనలాగా.

మనం మెచ్చుకునే కవి, అతని మాటలకే, రాతలకే విరుద్ధంగా తిరిగితే, విమర్శించక మానకూడదని చిరాకుపడి ఆయన్ని అక్షేపించటానికి ఈవ్యాసం వ్రాసారు.

అయనలో వచ్చిన ఈ మార్పునుమెచ్చుకుంటూ‌ ఎవరైనా వ్యాసాలు గట్రా వ్రాసారేమో తెలియదు. నాదృష్టికి ఐతే రాలేదు.

రంగనాయకమ్మ గారి వ్యాసంలో ముఖ్యమైన విషయాలు సంక్ష్హిప్తంగా.  

గద్దర్ మొదట్లో చొక్కా కూడా ధరించే వాడు కాదు. అది ఎబ్బెట్టుగా అనిపించి 2004లో రంగనాయకమ్మగారు ఒక వ్యాసంలో ప్రస్తావిస్తే ఆతరువాత నుండీ ఆయన చొక్కా ధరించటం మొదలు పెట్టాడు. 

నేడుగద్దర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులూ, పాలకవర్గాల స్వాముల వాళ్ళూ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాధినేతలు కలిసి తలపెట్టిన భక్తి టూరిజానికి ప్రచారకుడిగా గద్దరు తయారయ్యాడు చూడండి, అది చూసి ఎందరో బాధపడుతూ ఉంటే చూడలేక మళ్ళా రంగనాయకమ్మ గారు ఈవ్యాసం వ్రాస్తున్నారు.

గద్దర్‌ను అనుసరించి ఎందరో మా జీవితాలు ఆగమైపోయాయి అనుకుంటున్నారు. ఇప్పుడు రామ జపం, క్రిష్ణ జపం, రామానుజ జపం చేస్తున్నాడే గద్దర్ అని జనఘోష.  గతంలో ప్రత్యేక తెలంగాణ రావాలని భద్రాచలంలో, సీతమ్మ తల్లిని గద్దర్ మొక్కుకున్నాడని  ఒక వార్త కూడా ఉంది. 

రంగనాయకమ్మ ఆంటారూ, ". నిన్న ఏకంగా, జీయరు చానల్ అని అనధికారికంగా పిలిచే ఒక టీవీ చానల్లో, ఏం జరిగిందో చూశాను! భక్తి పారవశ్యంలో మునిగాడు గద్దరు. అతడు చేసిన ప్రశంసా వాక్యాల్నీ, భజన కీర్తనల్ని గుర్తు చేసే మైలు పొడవు పాటనీ విన్నాను. అంటే, ఒక నాటి ప్రజాయుద్ధ నౌక, ఈ నాడు భక్తి సముద్రంలో మునిగి పోయిందన్న మాట!" అని

రంగనాయకమ్మ గారి ఉద్దేశ‌ం‌ ప్రకారం, ఏఁ, ఒక మనిషికి అభిప్రాయాలు మార్చుకునే హక్కు లేదా? అభిప్రాయాలు మారవా?’ అని గద్దరో, అతడి భక్తులో, అడగొచ్చు. తప్పకుండా, ఆ హక్కు వుంది. ఉంటే, తగిన కారణం చెప్పాలి!‘ఒకప్పుడు వీర విప్లవ కవిత్వ నినాదాలు ఇచ్చి, గానాలు చేసి, ఇప్పుడు ఇలా పాలకవర్గ ఆధ్యాత్మిక సేవకుడైనావేమీ?’ అని విమర్శలతో అడిగే హక్కు, అతడి వెనకటి అభిమానులకు కూడా వుంటుంది.

ఇక్కడ ఇటువంటి మార్పును మనం ఇదివరలో చూడలేదా ఎక్కడా అని ఒక్కసారి ఆలోచిద్దాం.

విప్మవకారుడిగా బందిఖానాకు వెళ్ళిన అరవింద ఘోష్ అక్కడి నుండి యోగి అరవిందులుగా బయటకు వచ్చాడు.  అయన్ని నిజానికి తన తండ్రి విదేశాల్లో ఉంచి భారతీయ వాసనలు అంటి పాడైపోకుండా ఉండాలని ఆశించి ఎంతో కట్టుదిట్టాలు చేసి పెంచాడు. కాని విధి, అరవిందుణ్ణి ఋషిని చేసింది.

చలం సాహిత్యం ఎంత అలజడి రేపిందో అందరికీ తెలుసు. చివరికి పదిమందికీ తెలిసేలా అయన పుస్తకాలు చదవటానికి కూడా అరోజుల్లో జనం భయపడే వారని విన్నాను. స్త్రీస్వాతంత్ర్యం అంటూ గోలగోలగా దాదాపు విశృంఖల శృంగారం వ్రాసిన చలం చివరకు రమణాశ్రమంలో చేరాడు. తానంత వరకూ వ్రాసినదంతా ప్రక్కకు త్రోసి పారేసాడు. మీకి తెలుసా? భగవద్గీతకు మంచి వ్యాఖ్యను కూడా వ్రాసాడు. గీతాంజలిని కూడా తెలుగు చేసాడనుకుంటాను.

తన అభిప్రాయాలు మారితే దానికి ఎవరు కాని ప్రజాబాహుళ్యానికి ఎందుకు సమాధానం చెప్పుకోవాలీ? చలం తన అభిమానులకు సమాధాన‌ం ఎమని చెప్పాడూ? అరవిందుడు విప్లవకారులకు క్షమాపణ ఏమైనా చెప్పాడా?

ఈరోజున గద్దర్ నిజంగా భక్తి మార్గం పట్టి ఉంటే అదేదో‌ అనిదంపూర్వం అన్నట్లు రంగనాయకమ్మ ఆక్షేపించటమూ గోలపెట్టటమూ పొరపాటు.


3 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారూ..ఆమె ఆక్షేపణ భక్తి మార్గం పట్టాడని కాదు..పాలకులకు తాబేదారుగా తయారై..వాళ్ల భజనలు మొదలుపెట్టాడని..అంతేకానీ..రాముడిని కీర్తిస్తేనో..రామానుజులను పొగిడితేనో..ఆమె అభ్యంతరం పెట్టేది కాదు..జనం పట్టించుకునేవాళ్లు కాదు..అసలు ఆమె ఇప్పుడు వ్రాసిన వ్యాసం కూడా..మొదటిది కాదు..చాలామంది నెటిజనులు ఆయనపై విమర్శలు చేస్తూ..మీరు మాత్రం ఎందుకిలా ఉపేక్షిస్తున్నారు అని అడిగిన సందర్భంలో అని స్వయంగా ఆమే చెప్పుకుంది కదా..మీరు అందులోని మొత్తం సారాంశం గమనించకుండా..కేవలం భక్తుడు అయ్యాడని ఆమె విమర్శించారని పొరబడుతున్నారు..

    మీరు చలం..అరవింద్..ఇలాంటి వ్యక్తులతో ఈయన్ని పోల్చకండి..ఎవడు ఎలాగైనా మారొచ్చు దానికేం భాగ్యం
    అది కాదు పీడితుల పక్షాన పోరాడే ఈ నౌక..ఇప్పుడు చివరాఖరికి మురుగుకాలవల చెంతన చేరి అదే సౌగంధం అనుకుంటుందే అనేదే ఆమె భావన( మురుగుకాలవలంటే రాజకీయనేతలండీ బాబూ..మళ్లీ మీరు ఇంకోటనుకునేరు) దయచేసి భక్తిని..గద్దర్ అనబడే వ్యక్తి ప్రస్తుత స్థితిని మిళితం చేయవద్దు..

    రిప్లయితొలగించండి
  2. మీ వ్యాసంలోని అభిప్రాయం తో 100% agree శ్యామల రావు గారు. వ్యక్తులు తమ ఆలోచనలు,నమ్మకాలు, సిద్ధాంతాలు, స్వభావం.. వివేచనతో కాలగమనంలో మార్చుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది జన్మాంతర సంస్కారం ఉన్నపుడే జరుగుతుంది.

    రంగనాయకమ్మ లేక ఇతర వామపక్ష వాదులకు ఒకటే సూత్రం. Myway or Highway.
    వారు చెప్పిందే వేదం. Leftist ecosystem doesn't allow any alternative thinking.

    జీయర్ స్వామి గారితో అన్ని విషయాలలో ఏకీభవించక పోవచ్చు. అయితే వేద ప్రామాణ్యాన్ని శిరసా వహించి సనాతన ధర్మ వ్యాప్తికి పాటుపడుతున్న వారిపై నిందలు వేయడం, తూలనాడడం సరికాదు. దర్మాచార్యులు రాజకీయాలకు మార్గ నిర్దేశనం చేయడం భారత దేశం లో అనాదిగా ఉన్నదే. అది దేశానికి హితకారి.



    రిప్లయితొలగించండి

  3. రంగనాయకమ్మ గారు భారతం రాసేరు .

    ఆవిడ తిట్లు సర్కాస్టిక్ కామెంట్లు, వ్యంగ్య వ్యాఖ్యలు ఎడిట్ చేస్తే , ఆ భారతం ( అలాగే వేదంలో ఏముంది కూడా) , భారతం వచన రూపంలో నిజాయితీ తో పరిశోధించి మధించి వ్రాసి అచ్చొత్తించి తక్కువ ధరలో అమ్మిన ఆథెంటిక్ బుక్.

    అప్పుడు ఆవిడ గారు కూడా మహాసముద్రం లో మునిగి పోయినట్లే లెక్క :)

    జీయర్ గారు ( ఇచ్చిన ఏబిన్ ఇంటర్వ్యూ సారాంశం గా) మఠాధిపతి కాకుండా వుంటే వారి కాలానికి వున్న "అన్న" ల బాటే పట్టి వుండేవారు ( ఆ భావ జాలం తో ప్రభావితులై ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం వుండేది).

    May be that could have triggered gaddar too.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.