24, అక్టోబర్ 2023, మంగళవారం

జయ యనరే జయజయ యనరే

జయ యనరే జయజయ యనరే మన జానకిరామునకు
భయము లన్నిటిని పారద్రోలు మన పట్టాభిరామునకు

ఒక్కబాణమున రక్కసి తాటక నుక్కడగించిన వీరునకు
ఒక్కబాణమున సుబాహు బూదిగ  నొనరించిన రఘువీరునకు
ఒక్కబాణమున మారీచాసురు నుదధిని ద్రోచిన వీరునకు
చక్కగ గాధేయుని యాగమ్మును సంరక్షించిన రామునకు

కరమునదాలిచి హరు పెనువింటిని విరచిన ఘనబలవంతునకు
ధరణిజ కరమును గైకొని మురిసిన దశరధరాజకుమారునకు
పరుసములాడిన భార్గవరాముని భంగపరచిన వీరునకు
నిరుపమవిక్రమస్ఫురణకు పేరై నిలచిన శ్రీరఘురామునకు

వనసీమలలో దనుజులమూకల పనిబట్టిన సీతాపతికి
జనకసుతను గొనిపోయిన రావణు జంపిన భండనభీమునకు
వినయాన్వితులగు సుజనుల ననిశము వేడ్కను బ్రోచెడు రామునకు
తననామము భవతారకమై యిల తనరారెడు ఘనశ్యామునకు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.