12, అక్టోబర్ 2023, గురువారం

మరలమరల నిను తలచుట

 
మరలమరల నిను తలచుట కన్నను 
పరమసుఖము మరి వసుధను గలదా

దశరథనందన తాపత్రయహర
నిశాచరాంతకనిరుపమవిక్రమ
దశముఖహర కోదండపాణి యని
యశోవిశాల విహగవాహ యని

సురనాయక యని శుభదాయక యని
కరివరదా యని కంసాంతక యని
నరకాంతక యని నారాయణ యని
కురువంశాంతక గోవిందా యని

హరేరామ యని యానందముగా
హరేకృష్ణ యని యపురూపముగా
కరుణాజలధే కమలానాయక
నరసింహా హరి నాతండ్రీ యని