6, అక్టోబర్ 2023, శుక్రవారం

తగిన సంగతులు తగని సంగతులు


తగిన సంగతులు తగని సంగతులు తప్పక మీరు తెలియండీ
తగిన విధంబున మెలగిన సద్గతి తప్పక మీకు కలదండీ

భగవత్ప్రీతిగ భగవన్నామము పలుకుచు నుండుట తగును
భగవన్నామము మరచి  పనులలో పరాకుచెందుట తగదు

తారకనామము జిహ్వాగ్రంబున తాండవమాడుట తగును
ఊరిగొడవలను ప్రీతిగ  లొడలొడ నూరక వాగుట తగదు

చక్కని శ్రీహరిలీలల నెప్పుడు చదువుట వినుటయు  దగును
తక్కినవేవో సద్గ్రంథములని తగులుకొనుటయే తగదు

మనసున శ్రీహరిసౌందర్యంబును మననము చేయుట తగును
మనసున తరుణుల సౌందర్యంబుల మననము చేయుట తగదు

హరిని చూచుటకు హరిక్షేత్రములకు పరువులు తీయుట తగును
సిరుల వెంటను తరుణుల వెంటను పరువులు తీయుట తగదు

కోరి మోక్షమును తహతహలాడుట గొప్పవిషయ మది తగును
కోరగరానివే కోరుచు మనసున కుతకుత లాడుట తగదు

హరిహరులిద్ధరు నొకటే యన్నది యాత్మనెఱుంగుట తగును
హరియే గొప్పని హరుడే గొప్పని యరచుట మాత్రము తగదు

కల్లగురువుల బోధలు వినుచును కాలము గడుపుట తగదు
ఎల్లరు శివుడే చూపిన రాముని యెలమిని కొలుచుట తగును