5, అక్టోబర్ 2023, గురువారం

ఈచేయి మహిమతెలియ నెవ్వారి వశము

 
ఈచేయి మహిమతెలియ నెవ్వారి వశము
ప్రోచు నీచేయి యఖిల భువనముల ననిశము

అసురులు పైకొన్నచో నుసురు దీయు నీచేయి
అసమానవైభవం బొసగు నీచేయి
వసుధను సద్భక్తులకు వరములిచ్చు నీచేయి
కుసుమకోమలమైన గోవిందు చేయి

మున్ను హేమకశిపుని మన్నుచేసె నీచేయి
చిన్ని ప్రహ్లాదునకు క్షేమమొసగిన చేయి
పన్నుగ నబ్బలిముందు పరచినట్టి దీచేయి
తిన్నగా సిరినేలుచున్నట్టి చేయి

శరణుకోరిన వారి శిరము కాచు నీచేయి
సురల కభయము నిచ్చుచుండు నీచేయి
హరుని పెనువింటిని యట్టె విరచె నీచేయి
పరమాత్ముడు రాముని బహుమంచిచేయి