13, అక్టోబర్ 2022, గురువారం

కొంచెము మురళినూద కూడదటోయీ

 
కొంచెము మురళినూద కూడదటోయీ కృష్ణ
మంచిసమయ మోయి నామాట వినవోయి

మెల్లగ పొద్దువాలు చల్లని సమయమిదే
చల్లనిగాలి వీచు సంధ్యాసమయ మిదే
పిల్లనగ్రోవి నూద వీలగు వేళ యిదే
నల్లవాడ మురళీనాదము చేయవోయీ

ఎవరూ లేని చోట ఎంతో చక్కని చోట
ఎవరూ రాని చోట ఎంతో మంచి చోట
ధవణాంశు డరుదెంచు తరుణమిది కాదా
సవరించి నీమురళి చక్కగ పాడవోయో

చీటికిమాటికి నిన్ను చేరగ రాలేనుర
మాటికిని పెద్దలను మాయచేసి రాలేను
ఆటలింక చాలుర అనువైన సమయమిది
నీటుకాడ యిక మురళి పాట పాడవోయీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.