10, అక్టోబర్ 2022, సోమవారం

చూడరే కృష్ణుని సొగసుకానిని

 
చూడరే కృష్ణుని సొగసుకానిని ఆట
లాడుచున్న బాలుని అతివలారా

నందుని కుమారుని నవనీతచోరుని 
    బృందావిహారిని వనితలారా 
మందస్మితవదనారవిందుని గోవిందుని 
    యిందువదనుని మందయానలారా

కమలాయతాక్షుని కమనీయగాత్రుని 
    కరుణాలవాలుని కాంతలారా
యమళతరుభంజనుని యశోదానందనుని 
    సుమకోమలమూర్తిని సుదతులారా

గోలోకరక్షకుని గోపాలనాయకుని 
    గోపీమనోహరుని కొమ్మలారా
కాలీయఫణిఫణాజాలవిక్రీడనుని
    కాలమేఘశ్యాముని భామలారా

సరసవచోనిపుణుని సకలసుగుణధాముని  
    సదావ్రజానందుని సకియలారా
పరమశుభమూర్తిని గిరిధరగోపాలుని 
     మురళీవినోదుని తరుణులారా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.