15, అక్టోబర్ 2022, శనివారం

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 4

మ. కలనన్‌ తావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండ మం  
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ హారకుం  
డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లో  
గలగం బారుచు నేగె నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!

మనం గతటపాలో చెప్పుకున్న చాటువు అల్లసాని వారి శరసంధానక్షమాది.. అన్నపద్యానికి ప్రతిస్పందనగా రామకృష్ణ కవి కూడా రాయలను పొగడుతూ చెప్పాడని జనశ్రుతిగా ఉన్న చాటుపద్యం ఇది.

ఈ కలనన్ తావక ఖడ్గఖండిత పద్యం ఎంత  ఉత్సాహాన్ని సభలో కలిగించిందీ అంటే అల్లసాని పెద్దనగారు కూడా వెంటనే ఒకతమాషా పద్యం చెప్పి రంజించారట సభను. అది వినండి.
 
మ.సమర క్షోణిని కృష్ణరాయల భుజాశాతాసిచే పడ్డ దు  
రమ దోర్దండ పుళిందకోటి యవన వ్రాతంబు సప్తాశ్వమా  
ర్గమునన్‌ కాంచి సెబాసహో హరిహరంగా ఖూబు ఘొూడాకి తే  
తుముకీ బాయిల బాయిదే మలికి యందు ర్మింటికిన్‌ పోవుచున్‌ 

మరి ఆపైన మన ముక్కుతిమ్మనగారు ఊరుకున్నారా. పెద్దనగారు ఉర్దూ మాటలు దట్టించి తమాషాపద్యం చెప్తే తిమ్మన గారు ఓఢ్రభాషానైపుణ్యం చూపుతూ ఇలా పద్యం చెప్పారట.

శా.రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్ర క్రూర ఖడ్తాహిచే  
గాయం బూడ్చి కళింగ దేశ నృపతుల్‌ కానిర్హరీ పోషణీ  
మాయా ఖీకుముటూరు లోటు కుహుటూ మాయా నటాజా హరే  
మాయాగ్షేయ మడేయటంద్రు దివి రంభాజారునిన్‌ యక్షునిన్‌ 

ఈపద్యాలన్నింటికీ చెప్పుకోవటం వీలౌతుందో లేదో అవటుంచుదాం. మనం తావకఖడ్గఖండిత పద్యాన్ని చూదాం ప్రస్తుతానికి. కొంచెం దీర్ఘసమాసాలను విడివిడిగా వ్రాస్తూ  పద్యభాగాలను విడదీసీ చూస్తే పద్యం ఇలా ఉంది.

మ. కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త, మార్తాండ మం  
డల భేదంబొనరించి యేగునెడ, తన్మధ్యంబునన్‌ - హార కుం  
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో  
గలగం బారుచు నేగె, నీవ యను శంకన్‌, కృష్ణరాయాధిపా!
 
ఈ పద్యానికి అన్వయం చూదాం.  కలనన్‌, తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త,  మార్తాండమండలభేదం బొనరించి యేగునెడ, తన్మధ్యంబునన్‌, హార కుం  డల కేయూర కిరీట భూషితుని, రీనారాయణుం, గాంచి, లో గలగం బారుచు నేగె, నీవ యను శంకన్‌, కృష్ణరాయాధిపా అని.

కలను అంటే యుధ్ధం.
తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త అంటే నీ కత్తిచేత ఖండించబడిన శత్రు రాజు అని అర్ధం. ఇక్కడ తావక అంటే నీ‌యొక్క, ఖండనం అంటే నరకటం. ఖండితుడు అంటే చంపబడ్డవాడు. రిపుడు అంటే శత్రువు. క్ష్మాభర్త అంటే భూమిపతి అనగా రాజు. వెరసి నీకత్తి దెబ్బకి చచ్చిన శత్రురాజు అని అర్ధం.

మార్తాండమండలం అంటే సూర్యమండలం. యుధ్ధంలో మరణించినవాడు వీరమరణం పొందాడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు. వారు సూర్యమండలం చేరి ఆపైన ఊర్ద్వలోకాలకు వెళ్తారని ప్రతీతి. సామాన్యజనం మృతిపొందితే వారు చంద్రమండలం చేరి పితృలోకాలకు వెళ్ళి అపైన ఊర్ద్వగతులు పొందుతారని అంటారు. రాయలవారి చేతిలో ఇలా వీరమరణం పొందిన శత్రురాజు సూర్యమండలం చేరాడట, ఆమండలాన్ని


భేదం బొనరించి యేగునెడ అంటే ఆ సూర్యమండలాన్ని  దాటి వెళ్ళే‌ సందర్భంలో ...

అక్కడ వారికి శ్రీనారాయణుడు కనిపించాడని అంటున్నారు శ్రీనారాయణుం గాంచి అని చెప్పటం ద్వారా.
 
ఆనారాయణుడు ఎలా ఉన్నాడు?

అయన హార కుండల కేయూర కిరీట భూషితుడుగా ఉన్నాడు. అంటే ఎంతో వైభవంగా ఉన్నాడు. ఆయన మెడలో అనేక రత్నహారాలున్నాయి. ఆయన అందమైన రత్నకుండలాలను ధరించి ఉన్నాడు. అయన చక్కటి వజ్రాలు పొదిగిన భుజకీర్తులను ధరించి ఉన్నాడు. గొప్ప నవరత్నశోభితమైన అందమైన కిరీటం ధరించి ఉన్నాడు.
 
ఇంత వైభవంగా ఆసూర్యమండలాంతర్గతుడైన శ్రీనారాయణుణ్ణి చూసి ఆ చచ్చి అక్కడికి వచ్చిన శత్రురాజు ఎంతో భయపడ్డాడట.

కలగు అంటే కలతపడటం అని అర్ధం. గలగంబారు అంటే కలతపడి పరిగెత్తాడు అని!

ఎందుకు అలా భయపడి పరిగెత్తుతూ పోయాడు అంటే 

కృష్ణరాయాధిపా (అనగా ఓ‌కృష్ణదేవరాయ మహారాజా), 

నీవయను శంకన్! (అంటే అయ్యబాబోయ్ ఇక్కడ ఉన్నది  కృష్ణదేవరాయలురా అన్న అనుమానంతో) అట.

సూర్యమండలంలో  ఉండేది సూర్యనారాయణ మూర్తి అని అంటాం కదా, ఆ సంగతిని కవిగారు బహుచక్కగా ఉపయోగించుకున్నారు.

ఓకృష్ణదేవరాయా, నీవు నారాయణమూర్తిలాగా ఉంటారు. నీచేతిలో వీరమరణం పొందిన వాడు యధాప్రకారం సూర్యమండలం చేరినా అక్కడ ఉన్న నారాయణుణ్ణి చూసి నీవే అన్న భ్రమతో కలతపడి అక్కడినుండి పారిపోతాడు సుమా అని పద్యంలో కవి చమత్కారం.

ఇక్కడ ఛందస్సంబంధి ఒకటి రెండు విశేషాలు. రెండవపాదంలోనూ మూడవపాదంలోనూ కూడా యతిమైత్రి భంగం ఐనదేమో అని పిల్లకవులు అపోహపడే ప్రమాదం ఉంది. యతిమైత్రికి ఇబ్బందులు ఏమీ లేవు. పద్యాన్ని ఇల్లా చూడండి.
 
మ. కలనన్‌ తావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండ మ 
న్డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ హారకు 
న్డడ లకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లో  
గలగం బారుచు నేగె నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!
 
మండల అన్న మాటను మన్డల అనీ కుండల అన్నమాటను కున్డల అనీ కూడా వ్రాయవచ్చును నిక్షేపంగా.
యతి సరిపోతున్నది కదా!