ఈ దీపావళి పండుగ కూడా ఎప్పటిలాగే చప్పచప్పగా గడవటం మొదలుపెట్టింది.
ఉండ్రాళ్ళతద్ది నుండే ఊరిస్తూ ఉండే దీపావళి హడావుడి అట్టతద్దితో రంగప్రవేశం చేసేది మాయింట్లో ఒకప్పుడు.
అట్లతద్ది నాటికే నేనూ మాతమ్ముడు రామం ఇద్దరమూ సిసింద్రీల తయారీలో తలమునకలు అయ్యేవాళ్ళం.
మరికొద్ది రోజులకే మతాబాల తయారీ సన్నాహం బహు కోలాహలంగా మొదలయ్యేది. మతాబాల తరువాత చిచ్చుబుడ్లనూ తయారు చేసేవాళ్ళం.
వీశ సూరేకారానికి నూటయిరవై మతాబాలూ డజను చిచ్చుబుడ్లూ అని మానాన్నగారు లెక్కవేసేవారు.
ఆలెక్కను నేను పెద్దయ్యాక మార్చాను మతాబాలను సన్నగా చేయటం మొదలుపెట్టి.
నేను తాటాకు టపాకాయలనూ చేసేవాడిని. అదీ నాలుగైదు వందలు.
అగ్గి పెట్టెలూ కాకరపూవొత్తులూ సీమటపాకాయలూ మాత్రం కొనేవాళ్ళం తప్పదు కాబట్టి.
దీపావళీ అంటే మా నాన్నగారికి గొప్ప సరదా. ఆయన చిన్నప్పుడు పిచికలు అని ఒకరకం కాల్చేవారట. వాటిని పటాసూ పంచదారా కలిపి చేస్తారట.
మాఅమ్మగారికి కూడా దీపావళి చాలా యిష్టం.
మాయింట్లో అంతా మహాలక్ష్మీ స్వరూపాల సందడే సందడి. అందుకని పండుగల కళకళ బ్రహ్మాండంగా ఉండేది.
మానాన్నగారి నిర్యాణం తరువాత అందరూ నాదగ్గరకు హైదరాబాద్ వచ్చినా దీపావళి సందడి ఎప్పటి లాగే కొనసాగింది.
క్రమంగా రోజులు మారాయి.
అమ్మాయిలంతా పెళ్ళిళ్ళై అత్తవారిళ్ళకు వెళ్ళారు.
మగపిల్లలమూ ఇళ్ళూవాకిళ్ళూ ఏర్పరచుకొన్నాం.
నేను గచ్చిబౌలిలో స్థిరపడ్డాను.
ఇద్దరమూ అంటే నేనూ మాశ్రీమతి పెద్దవాళ్ళం ఐపోయాం. ఆరోగ్యసమస్యలూ ఉన్నాయి. ఇద్దరం రంగురంగుల మందుబిళ్ళలను నిత్యం ముప్పూటలా మింగుతూ ఉంటాం.
కేవలం ఇద్దరు వృధ్ధులు మాత్రం ఉండే ఇంట్లో దీపావళి ఏమి శోభగా ఉంటుంది!
మంగళవారం నాడు సూర్యగ్రహణం కాబట్టి సోమవారం నాడే దీపావళి అన్నారు. శుభం. అలాగే అనుకున్నాం. మాకు దీపావళి ఎప్పుడైనా ఒక్కటే!
మంగళవారం నాడు మాశ్రీమతి శారదకు డయాలసిస్ సెషన్ ఉంటుంది. వారంలో మూడుసార్లు డయాలసిస్. మంగళవారం, గురువారం శనివారం ఆరోజులు.
శనివారం నుండి మంగళవారం వరకు అంటే మూడు రోజుల వ్యవధి. డయాలసిస్ పేషంట్ శరీరంలో వ్యవధి ఎక్కువ ఐన కొలదీ నీరు చేరటం ఎక్కువ అవుతుంది.
నీరు ఎక్కువ ఐపోతే డయాలసిస్ పేషంట్ ఆయాసం బారిన పడే ప్రమాదం ఉంది.
అందుచేత డయాలసిస్ పేషంట్ ద్రవాహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
దానికి తోడు ఈపేషంట్లు శరీరంలో పొటాషియం మోతాదు పెరుగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మేము అన్ని కూరలూ ఒకసారి వార్చి మరీ వండుకుంటాం.
ఇలా తిండికి ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పి పండుగలకు కూడా సాధారణంగా ఇల్లు కదలం.
దీపావళి నాటి రాత్రి కాబేజీ చప్పిడి కూరతో భోజనం అయిందంటే అయింది అనిపించాం.
కాలక్షేపానికి రెండు సినీమాలు చూసాం. పెద్ద రామారావు చేసినవి. మొదట భట్టివిక్రమార్క చూసాం. తరువాత బాలనాగమ్మ చూసాం.
మేముండే కమ్యూనిటీలో ఆరువందల కుటుంబాల వరకూ ఉన్నా ఆట్టే సందడి కనిపించలేదు. ఈసారి కమ్యూనిటిలో ఉన్న పదహారు బిల్డింగులకూ అటూ ఇటూ ఉన్న విశాలమైన ఖాళీస్థలాల్లో బాణాసంచా కాల్చవద్దని చెప్పారు. ఒక స్థలం చెప్పి అక్కడ కాల్చుకోమన్నారు. కొందరికి ఆ ప్రతిపాదన నచ్చలేదు. పొలోమని అందరూ పోయి ఒక చిన్నస్థలంలో ఎలా బాణాసంచా కాల్చేదీ అని వాళ్ళ అభ్యంతరం. సబబే మరి. దాంతో ఈరాత్రి టపాసుల మోత వినిపించనే లేదు.
ఇదేమిట్రా ఈదీపావళీ మరీ చప్పగా ఉందీ అనుకుంటున్నాం.
ఇంతలో మావాళ్ళ ఇళ్ళల్లో దీపావళి సందడి ఫోటోలూ వీడియోలూ వచ్చాయి.
అందులో రెండు చూదాం.
మొదటిది మాశ్రీనిథి దీపాలు వెలిగిస్తున్న దృశ్యం. శ్రీనిథి మానలుగురు అన్నదమ్ములకూ ఏకైక కుమార్తె. అందుచేత చిట్టితల్లి ప్రత్యేకం.
రెండవది మాపెద్దచెల్లెలు అనురాధ దీపాలు వెలిగిస్తున్న దృశ్యం. మానాన్నగారి పెద్దకూతురు ప్రత్యేకం కదా మరి మా అందరికీ.
ఇవి కాక ఇంకా కొన్ని వచ్చాయి. మొత్తానికి ఇలా చిన్న సంతోషాలు కలగటంతో దీపావళి మాకూ కొంచెం సంతోషంగానే గడిచింది.
సినీమాలు రెండూ పూర్తిగా చూసి, యధాప్రకారం మొబైల్‌లో ఉదయం ఆరున్నరకు అలారం సెట్ చేసుకొని విశ్రమించాం. తెల్లారి గబగబా తెమిలి డయాలసిస్ సెంటర్‌కు వెళ్ళాలి కదా!
👌🙏
రిప్లయితొలగించండి