కం.మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా
ఈపద్యాన్ని తెనాలి రామకృష్ణ కవి నంది తిమ్మనను ప్రశంసిస్తూ చెప్పాడని ప్రతీతి.
ఈపద్యానికి అన్వయం చూదాం. సింగయ తిమ్మా , కూపనటద్భేకములకు గగనధునీశీకరముల చెమ్మ (అబ్బునే)? మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి యబ్బునే?
కూపనటద్భేకములు అంటే బావిలోతిరిగే కప్పలు. కూపం అంటే బావి. భేకం అంటే కప్ప అన్నవి అర్ధాలు కాబట్టి, కూపనటద్భేకములు అంటే బావిలోతిరిగే కప్పలు.
గగనం అంటే ఆకాశం. ధుని అంటే నది. శీకరములు అంటే నీటి తుంపురులు. గగనధుని అంటే ఆకాశగంగ. కాబట్టి గగనధునీశీకరములు అంటే ఆకాశగంగా ప్రవాహం తాలూకు నీటి తుంపురులు. ఇక్కడ చెమ్మ అంటే తడి అని ఒక మాట ఉంది. నిజానికి దీనిని ఇంక పెద్దగా పట్టించుకోనక్కర లేదు. తుంపురుల తడి అని చెప్పవచ్చును కావాలంటే.
బావిలో ఉండే కప్పలకు ఆకాశగంగ తుంపురులు అబ్బుతాయా? అబ్బే అవి వాటికి లభించేందుకుఆస్కారం లేదు అని కదా సమాధానం.
జానపదులు అంటే కవిహృదయం పల్లెటూరి జనం అని. పల్లెటూరి జనానికి సహజంగానే వ్యవసాయాది వృత్తుల నైపుణ్యాలే కాని తీరికగా సాహిత్యకృషి చేసేందుకు పెద్దగా అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండటం అరుదు. మాకొలది జానపదులకు అంటే మాలాంటి పల్లెప్రజలకు అని అర్ధం.
కవనపుఠీవి అంటే కవిత్వంలో గాఢత (గొప్పదనం) అని అర్ధం.
ఓ నంది తిమ్మయా, నీకవిత్వంలోని ఠీవి మాలాంటి పల్లెటూరి వాళ్ళకు అబ్బుతుందా? ఎక్కడన్నా బావిలో కప్పలకు ఆకాశగంగలో తుంపురులు లభిస్తాయా?
ఇలా కవి నంది తిమ్మన్నను రామకృష్ణ కవి ప్రస్తుతించాడు.
ఇలా రాయలవారి సభలో నంది తిమ్మన్న కవిపై రామకృష్ణ కవి ఈపద్యం చెప్పిన తరువాత రాయల వారు కలుగ జేసుకొని గగనధుని బదులు నాకధునీ అంటే ఇంకా బాగుంటుందేమో అని సవరించారట. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మూడవపాదంలో భేకములకు నాకధునీ అని అనటం వలన ప్రాసగా కకారం పడుతున్నది భేక - నాక శబ్ధాల పొందికతో. ఆసవరణను రామకృష్ణ కవి మెచ్చి రాయలను రాజకవివే కావయ్యా కవిరాజువు అని పొగిడాడని ఐతిహ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.