12, ఆగస్టు 2020, బుధవారం

పుట్టువే లేని వాడు పుట్టినాడు

పుట్టువే లేని వాడు పుట్టినాడు వాడు
పుట్టుట మనభాగ్య మనగ పుట్టినాడు

తల కింత జూలుతో తానొక కంబము నుండి
బలవంతుడు హేమకశిపు పట్టిపల్లార్చ
నలనాడు తోచె నృహరి యసుర సంధ్య వేళ
తిలకించుడు వాడే కలిగె మరల నేడు

ఇలకు తా నరుడ నని యెంచుకొనుచు వచ్చె
బలవంతుడు రావణుని పట్టిపల్లార్చ
కలిగె మిట్టమధ్యాహ్న కాలాన రాముడై
తిలకించుడు వాడే తిరిగి వచ్చె నేడు

ఇలకు తా వెన్నుడ నని హెచ్చరించుచు వచ్చె
బలవంతుల నసురుల పట్టిపల్లార్చ
కలికి కద్దమరాతిరి కలిగినాడు కృష్ణుడై
తిలకించుడు వాడా దేవుడే నేడు