ఏమి చేతుర లింగ ఏమి చేతుర
ఏమి చేతుర లింగ ఏమి చేతుర
గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ
అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ
ఈ పాటను బాలమురళి అద్భుతంగా గానం చేసారు. ఆయన గొంతులో యీ తత్త్వాలన్నీ గొప్పగా ఉంటాయి వినటానికి.
తత్త్వాలలో కొట్టవచ్చేటట్లు ఉండే ఒక గుణం ఏమిటంటే వాటిలో భాషాశుధ్ధికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
చేతు కోతు ఇత్యాదులు తప్పు ప్రయోగాలు. వ్యాకరణం ఒప్పదు మరి.
కాని ఈపాటలో చేతురా అన్న ప్రయోగం ఉంది. ఇంకా అనేక తత్త్వాల్లోనూ ఇలాంటి వ్యాకరణ విరుధ్దమైన ప్రయోగాలు బహుళంగా కనిపిస్తాయి.
దీనికి పెద్ద కష్టపడి కారణం వెదుక నక్కర లేదు. ఈ తత్త్వాలను పాడే వారు ఎక్కువగా దేశద్రిమ్మరులైన సాధువులు. వాళ్ళలో ఎక్కువ మంది వేరే వాళ్ళు పాడుతుండగా విని నేర్చుకొని పాడిన వారే, పాడేవారే.
ఏ తత్త్వగీతం మూలప్రతి ఐనా ఎవరో ఒక కవి శుధ్ధంగా వ్రాసి ఉండవచ్చును. ఆ కవి కూడా ఒక దేశద్రిమ్మరి గోసాయి కావటానికి బోలెడు సావకాశం ఉంది.
అతడి నుండి ముఖతః విని నేర్చుకున్న వారు, వారి శక్తి మేరకు పాడటం వారి ద్వారా ఆ తత్త్వగీతం వ్యాప్తి చెందటం అన్నది సాధారణమైన విషయం.
ఐతే ఈపాడే వాళ్ళలో అనేకమంది గోసాయిలకు పెద్దగా చదువూ సంధ్యా ఉండదు. అందుచేత కొన్ని పదాలను వారు తప్పుగా ఉఛ్ఛరించటం తరచు జరుగుతూ ఉంటుంది. ఆతప్పులు అలాగే ప్రచారం కావటం కూడా అంతే సహజంగా జరుగతూ వస్తుంది కూడా.
ఐతే ఈ తత్త్వాలు ఎంతో ప్రచారంలోని వచ్చినవే మనం నేడు వింటున్నాం. ఇంకా కొన్ని అంత తేలిగ్గా బోధపడకో అంతగా మనస్సుకు హత్తుకోక పోవటం వలననో జనానికి అంది ఉండవు. అందాయీ అంటే వాటిల్లో ఉన్న శ్రవణసుభగత ముఖ్య కారణం.
ఈ ఏమి చేతుర లింగా అన్న తత్త్వ గీతం బాలమురళి గొప్పగా గానం చేసారు.
భగవంతుడికి మనం పూజ చేస్తాం. కాని అసలు పూజ అంటే ఏమిటో ప్రజల్లో అనేక మందికి సరైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఎక్కువ మంది చేసే పూజావ్యవహారం అంతా వట్టి మొక్కుబడి వ్యవహారం కాబట్టి.
అసలు భగవంతుడి గురించిన సరైన అవగాహన - అంటే భగవంతుడికీ భక్తుడికీ మధ్యన ఉండే బంధం గురించిన సరైన అవగాహన సర్వే సర్వత్రా తప్పుగా అర్ధం చేసుకోబడుతున్నది. ఇది చాలా విచారించవలసిన విషయం.
భక్తి అనేది పరమప్రేమరూపా అంటారు నారదమహర్షి, ఆయన కన్నా గొప్ప భక్తిపరులను ఎవరిని మనం ఎరుగుదుం చెప్పండి. ఆయన మాట ప్రమాణం. ఆప్త వాక్యం కదా.
భగవంతుడిని అత్యంతం ఆత్మీయుడు అని భావించి అంతా ఇంతా అనరానంత ప్రేమతో మెలగటమే భక్తి.
మరి పూజ అంటే?
భగవంతుడిని పిలిచి సత్కరించి ప్రవర్తించటం అన్నమాట.
మీకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి మీ యింటికి వచ్చాడని అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారు?
ఎలా అతిథి సత్కారం చేస్తారు?
ఎలా మీ మంచి చెడ్డలు చెప్పుకుంటారు?
ఎలా మెలగుతారు?
ఆ వ్యక్తి వీడ్కోలు తీసుకుంటుంటే ఎలా సాదరంగా సాగనంపుతారు?
ఇదంతా మీకు సులువుగానే అవగాహన అవుతున్నది కదా.
అదే విధంగా, మీకు అత్యంత ఆత్మీయుడైన భగవంతుడిని మీరు ఆహ్వానించారు మీ యింటికి. ఆయన వచ్చాడు. మీరు సాదరంగా స్వాగతం పలికి ఎంతో ప్రేమతో గౌరవంతో మెలగుతూ ఆయన్ను సంతోష పెట్టటమే పూజ అంటే.
సంప్రదాయం ప్రకారం పూజలో పదహారు ఉపచారాలను చేయాలి. ఏదో రూలుందని చేయటం కాదండీ, ప్రేమతో శ్రధ్ధగా చేయాలి. మనం పరాకు పడకుండా ఉండటానికే ఈ పట్టికను గుర్తుపెట్టుకోవాలి.
1. ఆవాహనం, 2. ఆసనం, 3. పాద్యం, 4. అర్ఘ్యం, 5. ఆచమనీయం, 6. అభిషేకం, 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం, 10. పుష్పం, 11. ధూపం, 12. దీపం, 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. ప్రదక్షిణం, 16. నమస్కారం.
ఇవీ ఆ ఉపచారాలు.
వీటి గురించి కొంచె క్లుప్తంగా చెప్పుకుందాం.
ఆవాహనం అంటే ఆహ్వానం పలకటం. కాలింగ్ బెల్ మోగగానే పనమ్మాయి వచ్చి తలుపుతీసి సరే రండి అనటమూ ఇంటి యజమాని స్వయంగా గుమ్మంలో ఎదురుచూస్తూ ఉండి ఇంత పెద్ద ముఖం చేసుకొని ఆనందంగా రండి రండి అని సంభ్రమంగా ఎదురొచ్చి లోపలికి తీసుకొని వెళ్ళటమూ రెండూ ఒకటి కావు కదా. పూజలో ఆవాహనం అంటే భక్తి శ్రధ్ధలతో సంతోషంతో భగవంతుడిని ఆహ్వానించటం అన్నమాట.
అసనం అంటే కూర్చోండి అని మంచి కుర్చీ చూపించటం. మనం చూడండి ముఖ్యమైన అతిథులు వస్తున్నారని తెలిస్తే ఎంత హడావుడి చేస్తాం? ఇల్లంతా సర్దేసి, వారొస్తే కూర్చోవటానికి మంచి మంచి ఆసనాలు సిధ్ధం చేస్తాం కదా. సోఫా కవర్లు మొన్నమొన్ననే మార్చినవే ఐనా సరే బీరువాలోనుండి కొత్తవో ఇస్త్రీవో తీసి అలంకరించి మరీ ఎదురుచూస్తాం. ఆ మర్యాదకీ వారు లోపలికి వచ్చాక ఏదో కుర్చీలో నుండి తువ్వాలో మరొకటో తీసి కూర్చోండి అనటానికి అబ్బో ఎంతో తేడా లేదా? ఆసన మర్యాద అంటే తెలిసింది కదా. మన ఇంటికి భగవంతుడు వచ్చాడు. ప్రేమతో ముందే సిధ్దం చేసిన ఉచితాసనం అర్పించటమే ఆ మర్యాద మరి.
పాద్యం అనేది ఒకటుంది. ఈ కాలంలో ఐతే మాయమై పోయింది కాని పూర్వం ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్ళుకడుక్కుందుకు నీళ్ళివ్వటం మర్యాద. ఐతే అతి ముఖ్యమైన అతిథి వస్తే? ఆ అతిథి కాళ్ళు కడుక్కుని వచ్చాక కుర్చీ చూపటం కాదు - ముందే మంచి కుర్చీలో కూర్చో బెట్టి స్వయంగా కాళ్ళు కడిగి గౌరవం చేయటం బాగుంటుంది కదా. అది కదా ఆత్మీయ మర్యాద, మరి భగవంతుడే వచ్చాడే, అంత కంటే అత్యంత ఆత్మీయుడైన అతిథి ఎవరుంటారు చెప్పండి. అందుకని మనం స్వయంగా ఆయన్ను ఆసీనులను చేసి కాళ్ళు కడిగి గౌరవించటం పాద్యం అర్పించటం.
ఆచమనీయం అంటే బయటనుండి వచ్చిన అతిథికి కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వటం వంటిది. చూడండి ఎవరన్నా వస్తే మంచితీర్ఘం ఇవ్వటం ముందుగా చేస్తాం కాని కారప్పూసా మిఠాయి ఉండా పెట్టిన ప్లేటు ముందుగా తేము కదా. అదలా ఉంచి బయట నుండి వచ్చిన వ్యక్తికి ఎంత లేదన్నా కాస్త దుమ్మ ధూళీ ఆ దిష్టీ ఈదిష్టీ తగిలి కాస్త శౌచం లోపం అవుతుంది. వచ్చిన వారు కాస్త పురాణాచమనం ఐనా చేసి తిరిగి శుచి కావటం సంప్రదాయం. భగవంతుడికి నిత్యశుధ్ధి ఐనా సరే కాస్త మనం గొంతు తడుపుకుందుకు మంచినీళ్ళివ్వాలా వద్దా చెప్పండి?
ఆ వచ్చిన పెద్దమనిషికి హాయిగా స్నానం చేసి రండి భోజనం సిధ్ధంగా ఉందని చెబుతాము కదా అదే అభిషేకం. ఆ భోజనమే నివేదనం. ఇలా ఉపచారాలన్నీ కూడా భగవంతుడనే విశిష్టమైన అతిథికి మనం చేసే మర్యాదలు.
ఎంతో ప్రేమతో ఆ మర్యాదలు నెరవేర్చటమే పూజ అన్నమాట.
ఈ రోజుల్లో చూస్తున్నాం. ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం అంటారు. మనం వెళ్తాం. ఏదో మన భక్తి మనది. దేవుడి పూజ చూదాం అని వీలు కుదుర్చుకొని మరీ వెళ్తాం.
తీరా వెళ్ళాక చూడండి. ఆ పూజలో కూర్చున్న వారు వచ్చిన వారిని స్వాగతిస్తూ కనిపిస్తారు. సాధారణంగా ఐతే అది మంచి పధ్ధతే. కాని అక్కడ వాళ్ళు దేవుణ్ణి పిలిచి పూజ చేస్తున్నారు కదా. శ్రధ్ధ ఎక్కడ ఉండాలి? పూజ మొక్కుబడిగా నడుస్తూ ఉంటుంది. పూజచేస్తున్న వాళ్ళు వెనక్కి తిరుగుతూ ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడల్లా, వాళ్ళని పలకరిస్తూ.
మధ్యలో ఆ బ్రహ్మ గారు కలగ జేసుకొని అయ్యా ఆ పూవులు రెండు తీసుకొని దేవుడి దగ్గర ఉంచండి వంటిది ఏదో అనటం. వీళ్ళు అది కాస్తా మమ అనిపించి మళ్ళీ వెనక్కి తిరగటం.
ఇదా పరమ ప్రేమతో భగవంతుడిని పిలిచి మర్యాదలు చేయటం?
ఈ దిక్కుమాలిన పూజకు మురిసి దేవుడు వీళ్ళ అడ్దమైన కోరికలూ తీర్చాలా?
ఏమన్నా న్యాయంగా ఉందా?
శాఖా చంక్రమణం కాదు. కావాలనే ఈవిషయాలను ప్రస్తావించాను. ఈతత్త్వంలో పరమప్రేమతో భగవంతుడికి పూజ చేయాలని తాపత్రయ పడే భక్తుడి సందేహాలను ప్రస్తావిస్తున్నారు.
భగవద్గీతలో ఒక చోట భగవానుడి మాట
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః
అని. అంటే భగవంతుడికి కూడా మన పైన అపారమైన ప్రేమ కదా. ఆయన అందుచేత మనని ఇది పెట్టవోయ అది ఏదోయ్ అని నిలదీయడు. పాపం మనం ఏది పెట్టగలిగితే అది పెడితే చాలు సంతోషంగా స్వీకరిస్తాడు.
అలా మనం అర్పించ గలిగినది ఒక పండు కావచ్చు ఒక పువ్వు కావచ్చు. చివరకు ఒక గ్లాసు మంచినీళ్ళిచ్చి నా పరిస్థితి ఇంతేనయ్యా అన్నా సరే ఆయన అబ్బెబ్బె ఇది చాలు నాకు నిజానికి తినే వచ్చాను ఆకలిగా లేదు అనేస్తాడు. అది మనకు తెలిసో తెలియకో మనం చాలా హడావుడి పడిపోతాం.
వచ్చిన వాడు పెద్దవాడు. సాక్షాత్తూ భగవంతు డాయిరి. ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం అంటే బాగుండదు కదా. ఇలా అనుకొని అప్పోసొప్పో చేసి ఐనా సరే ఖర్చుకు వెనుకాడకుండా బ్రహ్మాండంగా నైవేద్యాలు సిధ్ధంచేస్తాం. ఒక్కొక్కసారి తెలివిగా, పూజకు సరిపడా కొద్దిగా నైవేదం సిధ్ధంచేస్తాం. మనకోసం సాదాసీదాగా ఏదో వండేసుకొని, ఆ భోజనంలో పిసరంత ప్రసాదం కూడా పెట్టుకొని తింటాం.
నిజానికి అలా చేయటం తప్పు.
మీయింటికి వచ్చిన ఆత్మీయుడికి మాత్రం నవకాయపిండివంటలతో ముందుగా భోజనం పెట్టి ఆపైన మనం ఆ పెద్దమనిషి చూడకుండా పచ్చడి మెతుకులతో భోజనం కానిస్తే, అది తెలిసి ఆయన ఎంత బాధపడతాడు? అయ్యో నా వల్ల ఎంత ఇబ్బందీ వీళ్ళకి అని ఎంతగా ఇదవుతాడు? ఆలోచించండి. అందునా మీరు ఎవరో పెద్దమనిషికి ఐతే ఆ వ్యక్తికి తెలియకుండా చడీ చప్పుడూ కాకుండా పచ్చడి మెతుకులూ మజ్జిగాతో సరిపెట్టుకో వచ్చును కానీ భగవంతుడి కళ్ళెలా కప్పుతారండీ? ఆయనకు తెలియనిది అంటూ ఉంటుందా?
భగవంతుడు అందుకే మరొక మాట కూడా అన్నాడు గీతల్లో
యత్క రోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ - మదర్పణం
దీని అర్ధంలో విశేషం ఏమిటంటే నాయనా, నువ్వు ఏది చేసినా నాపేరు చెప్పుకొని చేయి. ఏది తింటున్నావో అదే నాకు అర్పించు అని.
అందుచేత మనం మజ్జిగ పోసుకొని భగవంతుడికి పెరుగు స్పెషల్ అనకూడదు. ముందటి శ్లోకంలో ఆయన చెప్పాడు కదా, నీవు ఏది పెట్టగలవో దానినే నేను సంతోషంగా ఆరగిస్తాను అని.
ఇంతవరకూ మనం పూజ అంటే ఏమిటో అది ఎలా ఎంత ప్రేమగా చేయాలో చెప్పుకున్నాం.
అలా చేసేందుకు ఎంతో ఇబ్బంది వస్తోందట ఒక భక్తుడికి.
అందుకని శివుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.
ఏమయ్యా శివుడా నీకు నా శక్తి మేరకు పూజ చేదాం అనుకుంటున్నాను. కాని చూడవయ్యా ఎన్ని చిక్కులో, ఏమి చేయమంటావో నువ్వే చెప్పు?
గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
నీకోసం అతిపవిత్రం కదా అని గంగోదకం తెద్దామని వెళ్ళాను. తీరా చెంబు నీళ్ళలో ముంచగానే అందులో ఉన్న ప్రతి చేపా కప్పా కూడ నన్ను చూసి నవ్వాయి. ఏమయ్యా ఈనీళ్ళన్నీ మా ఎంగిలే కదా అన్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?
అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
అక్షయావులూ అని ఉన్నాయి. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు కావలసినన్ని పాలిచ్చే ఆవులు అన్నమాట. వాటి పాలు తెచ్చి నీకు సమర్పిద్దాం అనుకున్నాను. కాని ఆ ఆవుల దగ్గర తారాడే ప్రతిదూడా నన్ను చూసి నవ్వింది. అయ్యో ఆ పాలన్నీ మేము ఎంగిలి చేసిన పొదగుల కారణంగా అవీ ఎంగిలి ఐపోయాయి కదయ్యా అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
పోనీ నీకోసం కాసిని పూవులు తీసుకొని వద్దాం అని బయలు దేరాను. తుమ్మి చెట్టు కనిపించింది. బాగుంది పచ్చగా ఈపూలు బాగున్నాయి కోసుకొని వద్ధాం అనుకున్నాను. కాని ఆ పూవుల చుట్టూ బోలెడు తుమ్మెదలు తిరుగుతున్నాయి. అవేమో నన్ను చూసి ఈపూలన్నీ మేం ఎంగిలి చెసేసాం కదా ఎలా పనికొస్తాయీ నీకు అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?
చూస్తుంటే ఈ సృష్టిలో ఏదో ఒకరకంగా ఎంగిలి పడని దినుసే కనిపించటం లేదే! ఏదో ఒకటి అతి పవిత్రంగా తెచ్చి నీకు అర్పిద్దాం అనుకుంటే అది సాధ్యపడేది కాదని అనిపిస్తోంది.
ఆఁ. ఇప్పుడు తెలిసిందయ్యా, ఈ సృష్టిలో నేను దేనినీ సాధించి తెచ్చి నీకు అర్పించటం జరిగే పని కాదు.
మరి ఇంక నీకు అర్పించటానికి నా దగ్గర ఏమీ లేకపోయిందే! ఈ విధంగా అలోచిస్తే పరస్పరాశ్రయమైన ప్రాకృతిక వస్తువులతో నిన్ను పూజించటం అసాధ్యం అని తేలుతున్నది.
ఇంక మిగిలిందీ, అచ్చంగా నాదీ అనదగ్గదీ ఒక్కటే.
అదే నా మనస్సు.
దానినే నీకు అర్పిస్తాను.
(ఇలా మనస్సును అర్పిస్తానూ అన్నది పాటలో చెప్పకపోయినా మనం అవగతం చేసుకోవాలి స్వయంగా. భగవంతుడు మనం ఏది మనకు ఇంతే నా శక్తి స్వామీ అని ఇస్తే అదే స్వీకరిస్తాడు కదా.)
రిప్లయితొలగించండిఈ మధ్య రెండు మూడు దఫాలు నారదుల వారిని "తల్చేసు" కుంటున్నారు :) నారద భక్తి సూత్రాల మీద టపా యేమైనా వ్రాయబోతున్నారా యేమిటి ? :)
నారదా
జిలేబి
నేను కోరిన వెంటనే ఈ మహోన్నత తత్వానికి చక్కని విశ్లేషణ చెప్పినందుకు కోటి ధన్యవాదాలు గురువు గారూ.
రిప్లయితొలగించండిఒక్కో పదాన్ని ఒక అద్భుత ప్రయోగంగా రాసిన ఆ జానపద మట్టి మనిషి ఎవరో గానీ అతడికి హ్యాట్సాఫ్. మౌఖిక సంప్రదాయాల అనుగుణంగా భాషను & భావాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన బైరాగులు, భట్రాజులు ఇత్యాది పల్లె గీతగాళ్ళు ధన్యులు.
(పూర్తిగా సరదాగా వ్రాస్తున్న నా వ్యాఖ్య ఇది. శ్యామలరావు గారు నొచ్చుకోకూడదు మరి)
తొలగించండిజై గారూ,
“కోటి ధన్యవాదాలు” అని ఉట్టినే అనేస్తే ఎలాగండి? Say it with flowers. అందుకని “తుమ్మి పూవులు” తీసుకొచ్చి చెప్పాలి 🙂.
(jk 🙂)
సార్ ,
తొలగించండిభక్తుడు తుమ్మితే పూవులు ప్రస్తుతపరిస్తితుల్లో
శివుడంగీకరించునా ?jk
రాజారావు గారూ,
తొలగించండికాలాంతకుడు కాదుటండీ శివుడు. ఆయన అన్ని విషాలకు విరుగుడువిషం హాలాహలాన్ని ఎప్పుడో ఫలహారం చేసాడు. ఇంక ఈ కరోనాగిరోనా ఆయన్నేం చేయగలదు. శివుడికి చేదే బువ్వట అని కవి ఈవిషయాన్ని ఎప్పుడో దండోరా వేసేసాడే! మర్చిపోయారా?
తుమ్మినపుడు భక్తుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంతే కాని మనం వాడుకునేవి కావు కదా అని హా...ఛ్ అని పువ్వులమీదే తుమ్మెయ్యకూడదు. స్వామికి ప్రసాదం తయారు చేసినా ఆత్మారాముడికి అన్నం వండినా వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం.
తొలగించండిసూర్య,
తొలగించండిఅఫ్కోర్స్, సందేహమేముంది?
వేమన ఏనాడో చెప్పాడు కదా 👇
// ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ. //
వ్యక్తిగత శుభ్రత గురించి కూడా ఓ మాట గట్టిగా చెప్పుంటే బాగుండేది. అయితే ఆ విషయం కూడా చెప్పాల్సిందేనా? తమకు తాము గ్రహించుకోలేరా మనుషులు? ఈ “ఆధునిక” కాలంలో ఎలాగైనా శుభ్రత కొంచెం తగ్గిందనే అనిపిస్తుంది నా కళ్ళకు.
@విన్నకోట నరసింహా రావు:
తొలగించండి"“కోటి ధన్యవాదాలు” అని ఉట్టినే అనేస్తే ఎలాగండి? Say it with flowers. అందుకని “తుమ్మి పూవులు” తీసుకొచ్చి చెప్పాలి"
నిజమేనండీ. శ్యామలీయం మాస్టారు అడిగిందే తడవుగా నా ఫెవరిట్ తత్వానికి భాష్యం చెప్పినందుకు బదులుగా నేనూ ఓ మంచి కవిత రాసి సమర్పిద్దామని ఉంది. కాకపొతే చిన్నప్పుడు తరగతుల కంటే ఎక్కువగా ఇరానీ హోటళ్లలో హాజరీ ఎక్కువున్న కారణాన అశక్తడనయితిని మన్నించుడి! (jk)
ఉడతా భక్తిగా నాకెంతో ఇష్టమయిన మరియు నాకు కన్నడ కొంతయినా నేర్చుకోవాలన్న ఉత్సాహం కలిగించిన పురందర కీర్తన లింకు ఇస్తున్నాను (on a more serious note).
https://geetmanjusha.com/lyrics/17327-bhagyada-laxmi-baramma-%E0%B2%AD%E0%B2%BE%E0%B2%97%E0%B3%8D%E0%B2%AF%E0%B2%A6%E0%B2%BE-%E0%B2%B2%E0%B2%95%E0%B3%8D%E0%B2%B7%E0%B3%8D%E0%B2%AE%E0%B3%80-%E0%B2%AC%E0%B2%BE%E0%B2%B0%E0%B2%AE%E0%B3%8D%E0%B2%AE%E0%B2%BE
మీసాల వేలు పితడే
రిప్లయితొలగించండిమూసిన నడి నుదుట కన్ను మొనగాడితడే
వాసిగ నే గరళమయిన
తీసిగుటుక్కనుచు మ్రింగు దేవుండితడే .