9, మార్చి 2020, సోమవారం
ఎంతో మంచి దేవుడండీ ఈరాముడు
ఎంతో మంచి దేవుడండీ ఈరాముడు వాడు
చింతలన్ని చిటికెలోన చెదరగొట్టును
కడుపుతీపి వలన బొందె కైకమ్మ చింతను
యడిగినది పడతి మగని నడుగరానివి
ఒడయ డౌను కాదనక యుర్విని గూల
వడిగ తల్లి కోర్కె దీర్చ నడవి కేగెను
ఆపైన భరతున కంతు లేని చింతాయె
కాపాడు మనుచు వచ్చి కాళ్ళను బడియె
శ్రీపాదుని పాదుకలను శిరసున దాల్చి
తాపోపశమన మాయె తమ్మున కపుడు
రాముడు పురమందు లేక ప్రజలకు చింతాయె
రాముడు పాదుకల నొసగి రక్షణ గొలుప
భూమి నెల్ల వారలును పొంది రూరట
స్వామి వలన చింత దీర సంతసించిరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రెండు చిన్న సందేహాలు గురువు గారూ:
రిప్లయితొలగించండి1. రాముడిని "వాడు" అనడం సరియేనా?
2. "ఈరాముడు" బదులు "శ్రీరాముడు" అంటే బాగుండేదేమో?
ఛందస్సు & తదితర నియమాలు పరిమితిస్తే "ఎంతో మంచి దేవుడండీ శ్రీరాముడతడు" అంటే రచన ఇంకా మెరుగయ్యేదని నా అభిప్రాయం.
గమనిక: నాకు ఈ విషయాలేమీ తెలీవు కనుక ఇది కేవలం సూచన మాత్రమే.
తొలగించండిమా రాముడు వాడు అనైనా అంటాం, ఒరేయ్ అనైనా అంటాం బుజ్జికన్నా రారా అంటాం . మొరమ్ ఎక్కువయ్యేకొద్దికి అసలు తేడా లేదంటాం. మీరెవరండీ శ్రీ గట్రా ఏడ్ చేయమంటారు?
మిత్రులు జై గారు,
తొలగించండిభక్తి అంటే భయగౌరవాలు మాత్రమే కాదండీ. అది కేవలం లౌకికం. నారదుడు తన భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమప్రేమ రూపా అని అంటాడు. భక్తి యొక్క అసలు స్వరూపం భగవంతుడి యందు నిష్కల్మషమైన ప్రేమ అన్నమాట. లోకంలోనే చూడండి తల్లీబిడ్డల మధ్యా ఉండే ప్రేమ అనేది అత్యున్నతం అంటారు. అందరూ అమ్మను ఏకవచనంలోనే పిలుస్తారు సహజంగా. ఆ ఏకవచనం పరమప్రేమ సంకేతం ఎల్గాగో పరమభక్తిభావనలో భగవంతుణ్ణి నువ్వు వాడు వీడూ అనటం కూడా అంతే సహజంగా భక్తిసాహిత్యంలో ఎల్లెడా కనిపిస్తుంది.
సినిమాపాటల్లోలా కాక సంప్రదాయసాహిత్యసృజనలో కొన్ని నియమాలు ఉంటాయండీ. అందుచేత ఈరాముడు అనటం.
థాంక్సండీ.
తొలగించండిఏకవచనం అమర్యాద కాదని నాకూ తెలుసును. కాకపొతే formal literature లో వాడవచ్చునా లేదా అన్న నా సందేహం ఇప్పుడు మీ జవాబుతో తీరిపోయింది.
మా వైపు అమ్మా నాయనా తాత భార్య భర్త వగైరాలందరికీ ఏకవచనమే. సన్నిహితులలో బహువచనం చాలా అరుదు.
మధ్యలో వచ్చానని అనుకోకండి గానీ ..... “స్వామి రారా” అన్నట్లుగానే, జై గారూ.
రిప్లయితొలగించండి(“యదువంశ సుధాంబుధి చంద్ర ... స్వామి రారా” పాట విన్నారుగా?)
నిజమే గురువు గారూ, నాకప్పుడు తట్టలేదు. శ్యామలీయం మాస్టారు సమాధానం చెప్పాక నా సందేహం పూర్తిగా తీరింది.
తొలగించండి