(కాంబోది)
విచారించు హరి నావిన్నప మవధరించు
పచారమే నాదిగాని పనులెల్లా నీవే
తనువు నాదెందు గాని తనువులోనింద్రియములు
అవిశము నా చెప్పినట్టు సేయవు
మనసు నాదెందుగాని మర్మము నాయిచ్చ రాదు
పనిపడి దూరు నాది పరులదే భోగము
అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల
కలలోని కాపిరాలకతలపాలె
తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము
యెలమి బేరు నాది యెవ్వరిదో బలువు
కర్మము నాదెందు గాని కర్మములో ఫలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆధీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీ దింతే నేరుపు నీమాయది
ఇది అన్నమయ్య ఆథ్యాత్మసంకీర్తనల రెండవసంపుటం లోనిది. ఈ క్రీర్తన యొక్క రాగం కాంబోది. ఇటీవలి కాలంలో కొందరు దీన్ని కాంభోజి అంటున్నట్లు కనిపిస్తుంది. కాని అసలు పాత రాగం కాంబోది వేరే ఉంటే ఉండవచ్చును. ఇప్పుడు అది ప్రచారంలో లేదు. అన్నమయ్య సాహిత్యంలో అలాంటి పాత రాగాల పేర్లు చాలానే కనిపిస్తాయి.
ఈ సంపుటం యొక్క పరిష్కర్త గారు శ్రీమాన్ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు. వారు ఈ సంకీర్తనల్లోని సంధులలో రెండింటిని గూర్చి అధఃపీఠికలో
నాది + అందు గాని --> నాదెందు గాని
తనువులోని + ఇంద్రియములు --> తనువులోనింద్రియములు
అని అంటూ ఇట్టి సంధు లీ వాంగ్మయమున కలవు అని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇటువంటి చిత్రమైన సంధులు అన్నమయ్య చేయటం సర్వసాధారణం. కాని ఇక్కడ వాటికి సులభంగానే అన్వయం కుదురుతున్నది కదా అని అభిప్రాయం కలుగటానికి ఆస్కారం ఉంది.
ఎందుకంటే, నాది + ఎందు --> నాదెందు అన్నది వ్యాకరణామోదితమైన సంధి. తనువు నా దెందు గాని అన్నదానికి పదవిభాగం తనువు, నాది ఎందున్, కాని అని వస్తున్నది. అంటే ఇక్కడ ఎందున్ అన్న పదం ఏ జన్మలోనైనా అంటే ఏ ఉపాధిలోనైనా అన్న స్ఫూర్తిని కలిగిస్తున్నది అని గ్రహిస్తే సరిపడుతున్నది చక్కగా. అలాగే తనువులో నింద్రియములు అన్న ప్రయోగాన్ని తనువులోన్ + ఇంద్రియములు అని గ్రహిస్తే చాలు కదా, లోన్ అన్నది సరైన విభక్తి ప్రయోగమే కదా. సులువుగా ఆలోచన ఇలా సాగుతుంది.
కాని రామసుబ్బశర్మ గారు నాది + అందు గాని --> నాదెందు అని అన్నమయ్య సంధి చేసినట్లు ఊరికే అభిప్రాయపడ లేదు. ఎందుకలా అనుకున్నారు అన్నదానికి ముందుముందు వివరణ ఇస్తాను.
ఇక ఈ అథ్యాత్మ సంకీర్తనం యొక్క భావానుశీలనం చేయడానికి ప్రయత్నిద్దాం.
మొదట పల్లవిని చూదాం.
విచారించు హరి నావిన్నప మవధరించు
పచారమే నాదిగాని పనులెల్లా నీవే
మొట్టమొదట పచారమే నాది లో ఉన్న పచారం అంటే ఏమిటి? పచారం అంటే అంగడి, దుకాణము అన్నమాట. మన ఇప్పటికీ పచారీసరుకులు అన్నమాట వాడకం చేస్తూనే ఉన్నాం కదా. ఒక్కసారి గుర్తుచేసుకోండి.
ఓ శ్రీహరీ, కొంచెం ఆలోచించి చూడవయ్యా, నా విన్నపం కాస్త దయచూపి వినవయ్యా. ఈ నా ఉపాధి ఒక పెద్ద దుకాణం. పైకి దీనికి నేను యజమానిలాగా కనిపిస్తున్నాను కాని ఈ దుకాణం పనులన్నీ నడిపించేది నువ్వే కదా అంటున్నారు అన్నమయ్య ఈ సంకీర్తనం ఎత్తుకుంటూ. ఇక చరణాల్లో తన వాదనకు సమర్ధనలు మనవి చేసుకుంటున్నారు.
మొదటి చరణం.
తనువు నాదెందు గాని తనువులోనింద్రియములు
అవిశము నా చెప్పినట్టు సేయవు
మనసు నాదెందుగాని మర్మము నాయిచ్చ రాదు
పనిపడి దూరు నాది పరులదే భోగము
ఇదిగో ఈదుకాణం పెట్టిన కొట్టుందే అది నాదే. అబ్బో ఇప్పటికి ఇలా ఎన్ని దుకాణాలు తెఱచి ఉంటానో మూసి ఉంటానో. ఎప్పుడైనా సరే ఆ దుకాణం నాదే అంటాను. కాని అందులో పనివాళ్ళుగా నియమించుకున్న ఇంద్రియాలు మహా గడుసువి. అవి ఎప్పుడూ నేను చెప్పిన మాటను విననే వినవు సుమా. అలాగే ఈ దుకాణం మీద పెత్తందారుగా నియమించిన ఈ మనస్సును నేను నాదే అంటాను కాని, అది పేరుకు మాత్రమే నాది. కాని దాని నడత ఎన్నడూ నా యిష్టప్రకారంగా లేనేలేదు. అసలు ఈ పెత్తనం పుచ్చుకున్న మనస్సూ దాని క్రింద పనిచేసే ఇంద్రియాలూ అన్నీ కూడా అవి నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాయే కాని అయ్యో పాపం దుకాణందారు వీడు కదా అని నాకు పూచికపుల్లంత విలువైనా ఇవ్వటం లేదు.
ఇక రెండవ చరణం.
అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల
కలలోని కాపిరాలకతలపాలె
తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము
యెలమి బేరు నాది యెవ్వరిదో బలువు
ఈ చరణం అదాటున చూస్తే, చరణంలో మొదటిపాదంలో ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో లోపం ఉందని అనిపిస్తుంది. అలా అనుకొని పప్పులో కాలు వెయ్యకండి. ఈమాట చెప్పక తప్పదు. ఎందుకలా చెప్పవలసి వచ్చిందీ అంటే పాఠకులకు సులభంగా ఉండటానికి అన్నిచరణాల మొదటి పాదాలనూ, మూడవపాదాలనూ వరుసగా చూపుతున్నాను.
తనువు నాదెందు గాని తనువులోనింద్రియములు 1 -1
మనసు నాదెందుగాని మర్మము నాయిచ్చ రాదు 1 - 3
అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల 2 - 1
తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము 2 - 3
కర్మము నాదెందు గాని కర్మములో ఫలమెల్ల 3 - 1
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు 3 - 3
ఈ పైన ఇచ్చిన పాదాలన్నీ ఒకసారి పరిశీలించండి. రెండవచరణం మొదటి పాదం కురుచ అనిపిస్తుంది. ఎందుకో చూదాం. ప్రతిపాదాన్ని క్రీగీటుతో చూపిన యతిస్థానం దగ్గర విరచి చూడవచ్చును. పాదంలోని రెండుభాగాలూ తూకంగా ఉంటాయి. కొంచెం ఛందస్సూ మాత్రలూ అంటూ ఆలోచించగల వారికి ఉభయభాగాలూ సరిగ్గా పదకొండేసి మాత్రలుగా ఉండటం గమనించ గలరు. గానసౌలభ్యం కోసం ఈభాగాలన్నీ పన్నెండేసి మాత్రలుగా ఉఛ్ఛరించవచ్చును. దయానిధివి నీవు అని చివరి చరణం ఆఖరున ఉన్నా అది పన్నెండు మాత్రల కాలానికి చక్కగా తూగుతుందని కూడా కొంచెం కూనిరాగం తీయగల వారు గమనించ గలరు.
ఇక్కడ చిక్కల్లా రెండవ చరణం మొదటి పాదంతోనే. ఇది కాస్తా అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల అని ఉండటంతో యతి లోపించిందని తోస్తుంది. మరి అది అన్నమయ్య రచనావిధానం కాదే. ఆయన నియతంగా యతి ప్రాసలు రెండూ పాటిస్తారు కదా. మరి ఈపాదంలో సమన్వయం ఎలాగు అంటే, అది ఈ నాదెందు అన్న సంధి ప్రయోగం పైన కొంచెం గురిపెట్టి కుదుర్చుకోవాలి. నాది + అందు గాని --> నాదెందు అని రామసుబ్బశర్మ గారు చెప్పారు కదా. ఆప్రకారం చూసి ఈ అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల అన్న పాదాన్ని విడమరచి వ్రాస్తే
అలరి నానిద్దర నా దందు గాని సుఖమెల్ల
అవుతున్నది. ఇప్పుడు అలరి లో అ కు, అందు గానిలోని అం కు యతి మైత్రి చక్కగా సిధ్ధిస్తోంది. ఐనా ఒక్క చిన్న శంక ఉండి పోయింది 'నాదెంద గాని' అని కాక 'నాదెందు గాని' అని ఉండాలి. వ్రాయసకాని తప్పు ఐ ఉండవచ్చును. పోనిద్దాం.
ఇంక ఈ చరణం భావాన్ని తెలుసుకుందాం. పగలంతా అలసి ఉంటాను నీ కైంకర్యాదులతో అనుకుంటే రాత్రికి హాయిగా నిద్రపోవచ్చును ఆ నిద్రా సుఖం అంతా నాదే అనుకుంటాను. ఆఁ, ఏం సుఖం లేవయ్యా. ఏనాటి నిద్రాసుఖం ఐనా, అదంతా కలలోని కాపురం పాలె. అంటే కలల ధాటికి అంతా కలత నిద్రే అన్నమాట వేరే చెప్పాలా?
నేనేదో అంతో ఇంతో తెలివైన వాడిని అనుకుంటాను. నాతెలివి గొప్ప యేముంది. దానితో పనేముంది. రోజులు ఎట్లా గడిచేదీ నిర్ణయించేది కాలం ఐతేను.
ఇలా రాత్రి నిద్రను కలలు దోచి పగటి నా శ్రమను కాలం అజమాయిషీ చేసి నా గొప్ప అన్నది యేమీ లేదని తేలుస్తున్నది.
పగలు నాదుకాణం ఎలా నడపాలీ అన్న విషయంలో ఎన్నో తెలివైన ఆలోచనలు చేస్తే ఏ రోజు ఎట్లా గడిచేదీ అన్నది కాస్తా, నా తెలివి కాక, కాలం నిర్ణయిస్తోంది. పోనీలే రాత్రిపూట ఐనా సరే కాస్త హాయిగా ఉందాం అనుకుంటే ఆ రాత్రి అన్నది కూడా నీ పుణ్యమా అని వచ్చే కలలే లాగుకొని నిద్రాసుఖం కూడా లేకుండా చేస్తున్నాయి.
చివరి చరణం.
కర్మము నాదెందు గాని కర్మములో ఫలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆధీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీ దింతే నేరుపు నీమాయది
ఇక్కడ ధర్మపు శ్రీవేంకటేశ అన్న సంబోధనలో ధర్మపు పదం ధర్మపురిని సూచిస్తున్నదని అనుకోకూడదు. నిజానికి అన్నమయ్యకు వేంకటేశుడి తరువాత అమిత ఇష్టమైన దైవస్వరూపం నారసింహస్వరూపం. ఆయన సంకీర్తనలో ఏక్షేత్రంలో ఏరూపంలో ఉన్న మూర్తికి ఐనా వేంకటేశ ముద్ర తప్పని సరి. కాబట్టి ధర్మపు శ్రీవేంకటేశ అని సంబోధించ బడినది ధర్మపురి యోగనృసింహమూర్తి అనిపించవచ్చును. కాని అలా కాకపోవటానికే ఎక్కువ అవకాశం ఉన్నది. ఎందుకంటే ధర్మపురి తెలంగాణాలో ఉన్నది. అన్నమయ్య అంత దూరం వెళ్ళి ఆ క్షేత్రదర్శనం చేసి స్తుతించాడా అన్నది విచార్యం. కాబట్టి. ఇక్కడ సంబోధిత దైవమూర్తి వేంకటరాయడే అనుకోవటం సబబుగా అనిపిస్తుంది.
ఓ శ్రీహరీ, వేంకటేశా, ఏవేవో కర్మములు చేస్తూ ఉంటాను. అవన్నీ ఈ దుకాణం బాగుకోసం అనుకుంటాను. మరి ఈదుకాణం నాది కదా. కాని నేను ఏమి చేసినా దానికి ఎటువంటి ఫలితం వస్తుందో అన్నది తెలియకుండా ఉంది. నేను ఏమి కోరి ఏమి చేసి ఏమి ఫలితం ఆశించాలన్నా దానికి నాకు ప్రాప్తం అని ఉండాలి కదా. అదేమో నా పూర్వజన్మల అధీనంలో ఉంది. అప్పట్లో నేను చేసిన మంచి చెడ్డల ఫలితాలు నా కర్మలను నడిపిస్తున్నాయి కాని ఈదుకాణం నాదో నాదో అంటూ నేనూ చేయగలుగుతున్నది ఏమీ లేదయ్యా.
అసలు నాచేత ఈకొట్లు పెట్టించిందే నువ్వు. ఇలా పూర్వం కూడా ఎన్నో కొట్లు తెరిపించావు మూయించావు.
నువ్వు పెట్టించిన దుకాణాన్ని నేను నిర్వహిస్తున్నానని అనుకొవటం వట్టి భ్రమ. అదంతా నీమాయ నడిపిస్తున్న నాటకం. ఆమాయ నేర్పుగా నన్ను కొట్లో యజమానిగా కూర్చో బెట్టి అన్ని కార్యక్రమాలనూ నీవిగా నడిపిస్తున్నది.
నేను నిమిత్తమాత్రుడిని అంతే!
నువ్వే నాచేతనూ నాబోటి అనేక జీవులచేతనూ ఈసంసారంలో అనేకానేక విధాలైన అంగళ్ళు (దేహాలు) తెరిపిస్తున్నావు. వాటిలొ మేము ఊరికే కూర్చొని యజమానులం కాబోలు ననుకొని భ్రమపడుతూ ఉంటాము. కాని అదంతా నీ మాయా విలాసం మాత్రమే. నీమాయచే నీవినోదం కొరకు నడుస్తున్న నాటకం మాత్రమే అని ఈ సంకీర్తన యొక్క ఆంతర్యం.
శరీరాన్ని పచారీ కొట్టుతో పోల్చారు. బాగుంది గాని చిన్న విన్నపం. వ్యాకరణాన్ని వివరణలో కలిపేస్తే కొంచం ఇబ్బందిగా ఉంది. మన్నించగలరు.
రిప్లయితొలగించండిఅన్నమయ్య సాహిత్యంలో తెలుగు వ్యాకరణాన్ని అంతగా పట్టించుకోదండీ. అలాగని ఆయనకు తెలియదు అనుకొనేరు ఎవరన్నా. అదేం కాదు. అయనకు ఎంచక్కా తెలుసును.
తొలగించండిఆయన తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ మంచి పాండిత్యం ఉన్న వాడు. అనేక సంకీర్తనలను పూర్తిగా సంస్కృతంలో విరచించాడు. అడపాదడపా వ్యాకరణాన్ని త్రోసిరాజనటం ఆయన సంస్కృతంలోనూ దర్జాగా చేసాడు.
అసలు తెలుగు బాగా రావాలంటే అన్నమయ్యను బాగా చదవాలి అని ఒక అభిప్రాయం ఉందంటే ఆయన పదసంపద ఎంత గొప్పదో తెలుస్తుంది.
ఆయన తన సంకీర్తనాలను ప్రజారంజకత్వం ముఖ్యలక్షణంగా స్వీకరించి వ్రాయటం వలన జనబాహుళ్యంలోని ప్రయోగాలను యధేఛ్ఛగా యధాతధంగా ప్రయోగించాడు.
విచ్చలవిడిగా అలా ప్రయోగించటం వలన అప్పటి వారి సంగతి ఏమో కాని ఇప్పటి వారికి వాటిని సరిగా అన్వయించుకోవటం ఒక పెద్దపరీక్షగా మారింది.
అందుచేత సంకీర్తనలకు వివరణల్లో ఇలా వ్యాకరణాంశాలూ వస్తూ ఉంటాయి. చిత్రాతిచిత్రమైన సంధులూ సమాసాలూ పదబంధాలూ కొల్లలుగా ఉన్న ఈసాహిత్యంలో అన్వయం గురించి తెలుసుకోవటం అన్నది సాహిత్యాభిమానులకూ విద్యార్ధులకూ మాత్రమే కాదు పండితులకూ తరచూ ఒక సవాలే.
అన్నమయ్య గీతం అద్భుతం. మీ వివరణ ఎంతో బాగున్నది.
రిప్లయితొలగించండిఅన్నమయ్య గీతాలు చదవడం, వినడం అవి ప్రజా బాహుళ్యనికి చేరువ చేసిన వేంకటేశుని లీల ప్రత్యక్షంగా చూడడం ఏ జన్మలోనో చేసిన పుణ్యం ఈ జన్మలో ఫలించినట్లు భావిస్తాను.
అన్నముని కీర్తనలు కృతులు తెలుగు వారి విశిష్ట సంపద.
అన్నమయ్య ఊహా వైచిత్రి , పదాల పోహళింపు,దేశి కవిత రీతుల సొగసు, అంతర్లీనంగా దండలో దారంలాగా సాగే ఆధ్యాత్మిక చింతన అనితర సాధ్యం.
// “ అన్నముని కీర్తనలు ......” //
రిప్లయితొలగించండిఅన్నమయ్యను “అన్నముని” అని కూడా అంటారా?
కామిశెట్టి శ్రీనివాసులు గారు వ్రాసిన ఒక పుస్తకంలో అన్నముని అని షష్ఠి లో ఉపయోగించడం చదివాను sir.
రిప్లయితొలగించండిఅక్కడా ఇక్కడా చదివిన సేకరించిన మాటలు ఉపయోగిస్తూ ఉంటాను కానీ నా భాషా సాహిత్య పరిజ్ఞానం స్వల్పం మాత్రమే.
అయితే అన్నమయ్య అంటే నాకు ఎంతో అభిమానం. వాగ్గేయకారుల రచనలు అమితంగా ఇష్టపడతాను.
థాంక్స్ GKK (జీ) గారు.
తొలగించండిఅన్నముని అనటం సముచితమే.
తొలగించండి