17, మార్చి 2020, మంగళవారం

ఆరగించి కూచున్నాడల్లవాఁడె చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు - అన్నమయ్య సంకీర్తనం


(మాళవి)

ఆరగించి కూచున్నా డల్లవాఁడె

చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు



ఇందిరనుఁ  దొడమీద నిడుకొని కొలువిచ్చీ

అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె

చెందిన మాణికముల శేషుని పడగె మీఁద

చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు



బంగారు మేడలోన పచ్చల గద్దియల మీఁద

అంగనల ఆట చూచీ నల్లవాఁడె

రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల

చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు



పెండెపు పాదము చాఁచి పెనచి వొ కపాదము

అండనే పూజలుగొనీ నల్లవాఁడె

కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున

మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు


ఇది అన్నమాచార్యుల వారు నరసింహస్వామిపైన చెప్పిన సంకీర్తనం.

అన్నమయ్య శ్రీవేంకటేశ్వర స్వామి వారి పైన అనేక వేల సంకీర్తనలు విరచించారు. అలాగే భగాంతుడి ఇతర అవతార మూర్తుల గురించి కూడా సంకీర్తనలు చెప్పారు. వాటిలో అధికభాగం నరసింహ స్వామి పైన చెప్పినవే.

అహోబిలం సుప్రసిధ్ధ నారసింహ క్షేత్రం. అక్కడ ఉన్న పీఠానికి తొలి అధిపతి ఐన శఠకోప యతి అన్నమయ్యకు వేదాంత గురువు. అంతే కాదు శఠకోప యతి వద్ద అన్నమయ్య నరసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు.

ఆ నరసింహ మంత్రం 32 బీజాక్షరాలు కలది. బహుశః అందుకే అన్నమాచార్యులు శ్రీవేంకటేశుడి పైన ముప్పది రెండు వేల సంకీర్తనలను వెలువరించారు.

ఈ సంకీర్తనలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి వైభవం వర్ణిస్తున్నారు అన్నమయ్య.


    ఆరగించి కూచున్నాడల్లవాఁడె
    చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు

అంటూ విందు ఆరగించి దర్జాగా కూర్చున్న నరసింహ స్వామి వారిని స్తుతిస్తున్నారు.

ఈపాట పల్లవిని లక్ష్మీనారసింహుడు అని ముగించినట్లే ఆచార్యుల వారు పాటలోని మూడు చరణాలను కూడా అదేవిధంగా లక్ష్మీనారసింహుడు అనే ముగించారు. విశేషం ఏమిటంటే పరిష్కర్తలు సరిచేసిన విధంగా లక్ష్మీనారసింహుడు అని మనకు కనిపిస్తున్నది కాని నిజానికి రాగిరేకు మీద ఈపాటలో అంతటా లక్ష్మీనారసింహ్వుడు అనే ఉన్నది.

మీకు తెలుగు భాష పైనా దాని నుడికారం పైనా మంచి మక్కువ ఉంటే ఈపాట మీకు తప్పకుండా మనస్సుకు హత్తుకుంటుంది.  చూడండి ఈ పాట నిండా హాయిగా పరచుకున్న తెలుగు పదాల రాజసం.

ఈ పాటను తిరుమల తిరుపతి దేవస్థానంలో గాయకుడైన పారుపల్లి రంగనాథ్‍ గాత్రంలో వినవచ్చును.




ఈ సంకీర్తనాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారి గళంలో కూడా మనం వినవచ్చును.




ఈ పాట పల్లవి

    ఆరగించి కూచున్నా డల్లవాఁడె
    చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు

అంటే, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారు హాయిగా భోజనం చేసి కూర్చున్నారని పాట మొదలు పెడుతున్నారు ఆచార్యుల వారు.

అదిగో చూడండయా వాడే,  మనకు దగ్గరగానే, ఎదురుగానే లక్ష్మీనారసింహుఁడు హాయిగా ఆరగింపు కానిచ్చి కూర్చున్నాడు అంటున్నారు. అయన ఎలా ఉన్నాడు?

    ఇందిరనుఁ  దొడమీద నిడుకొని కొలువిచ్చీ
    అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె
    చెందిన మాణికముల శేషుని పడగె మీఁద
    చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు

అయన మనతల్లి ఇందిరమ్మను  (అంటే  లక్ష్మీదేవిని) తన తొడమీద కూర్చుండ బెట్టుకొని సభ తీర్చి ఉన్నాడు. హాయిగా అందమైన చిరునవ్వులు చిందిస్తున్నాడు. అదుగో ఆయనే చూడండి మరి అని మనని హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య.

ముందుగా అన్నమయ్య సాహిత్యంలో వచ్చీని చేసీని వచ్చీని వంటి మాటల గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఈ రోజు మనం చేసెను/చేసేను వచ్చెను/వచ్చేను అన్న అర్ధంలో చేసే వచ్చే అన్న మాటలను వాడుతున్నాము. అన్నమయ్య కాలంలో ఆ మాటలనే చేసీని వచ్చీని అని వాడేవారు అన్నమాట. అలాగే చివర ద్రుతం లేకుండాను కూడాఅ వచ్చీ అప్పట్లో అన్న మాటకు నేటి వాడుక వచ్చే అని.

ఇక్కడ కొలువిచ్చీ వరాలిచ్చీ అన్నప్పుడు ఈకాలం వారు వాటిని కొలువిచ్చే వరాలిచ్చే అని అన్వయం చేసుకోవాలి.  అంటే కొలువిచ్చెని వరాలిచ్చెను అని అర్ధాలు తీసుకోవాలి అన్నమాట.

అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె అన్న పాదం నేటి పధ్ధతిలో అందపు నవ్వులు చల్లే నల్లవాఁడె అని వ్రాయవలసి ఉంటుంది. చల్లేను అల్లవాడే అని పదవిభాగం వస్తుంది.  ఈ చల్లేను అన్నది ఆనాటి భాషలో చల్లీని అని ఉందన్నమాట. అందుచేత మూల ప్రతిలో చల్లీని అల్లవాడె అని ఉంది.

ఐతే ఇటువంటి పాటలు పాడేటప్పుడు ఒక సందిగ్ధత వస్తుంది. చల్లీని అని పాడితే మన కాలం శ్రోతలకు వింతగా అనిపిస్తుంది. కాని మూలం సాధ్యమైనంత వరకూ ఏమాత్రమూ మార్చకుండా పాడటం అన్నది చాలా ఉచితమైన విధానం. మనం పూర్వకాలపు వాగ్గేయకారుల రచనలను మనకాలానికి అనుగుణంగా భాష మార్చి పాడటం మంచి పధ్ధతి కాదు.

అల్లాగే మరొక ముఖ్య విషయం. అన్నమయ్య తన సంకీర్తనల్లో వాడిన విధానం ఏమిటంటే ఆయన ప్రతి పాదంలోనూ - అది పల్లవిలో ఐనా, చరణాల్లో ఐనా సరే - ప్రాసనూ యతినీ పాటించారు. ఒక్కొక్కసారి యతి ప్రాసలకు అనుగుణంగా చెప్పే ఉద్దేశంతో ఆయన వాక్యంలో పదక్రమాన్ని చిత్రమైన విధాలుగా ముందువెనుకలు చేసారు. తెలుగులో అది దోషం కాదు.

రాముడు ఇంటికి వెళ్ళెను అన్న వాక్యాన్ని మనం ఇంటికి రాముడు వెళ్ళెను అన్నా వెళ్ళెను రాముడు ఇంటికి అన్నా తేడా లేదు. కవిత్వంలో ఇది సాధారణమే.

ఐతే అన్నమయ్య ఒక్కొక్క సారి పదబంధాలను కూడా విరుగకొట్టి మరీ తన దారికి తెచ్చుకొని అటూఇటూ చేయటం పరిపాటి. ఒక్కొక్కసారి అవి చాలా వింతగా అనిపిస్తాయి. కనీసం మనకాలం వాళ్ళకు వింతగానే ఉంటాయి.

చెందిన మాణికముల శేషుని పడగె మీఁద చెంది అంటే ఏమిటో చూదాం. శేషుడు అంటే తెలుసు కదా ఆది శేషుడు. ఆయన గారు స్వామివారికి పడక మంచం. నిజానికి శేషుడు భగవానునికి ఏది అవసరం ఐతే ఆరూపం లోనికి మారి సేవచేస్తాడు. శయ్య అవుతాడు, ఆసనం అవుతాడు. కావలసి వస్తే పాదుకలు కూడా అవుతాడు.

అంత గొప్పవాడు ఆ శేషుడు. అయనకు పదివేల పడగలు. ఆపడగల మీద ధగధగ లాడే మణులు. వాటిని ఇక్కడ అన్నమయ్య మాణికములు అన్నాడు అంటే మాణిక్యాలు అన్నమాట. ఇక్కడ పదాలను శేషుని పడగె మీఁద చెందిన మాణికముల చెంది అని మార్చుకోవాలి. అంటే ఆ పడగ(లు) పట్టిన శేషుడి సేవ కారణంగా స్వామివారు మరింత ధగధగను చెందుతున్నారని అర్ధం.  ఈ విధంగా శేషుడు తన తనువెల్లా స్వామివారి సేవకు వినియోగిస్తున్నాడు. స్వామివారు శేషుని ఆసనంగా అంగీకరించారు. ఆ శేషస్వామి పడగల మణులను తాను తన శిరోభూషణాలుగా స్వీకరించారు. అవి ఆయన శోభను మరింతగా హెచ్చిస్తున్నాయి.

ఆదిశేషుడి పడగల మీది మాణిక్యాలు ఆదిశేషుడికి చెందినవి. కాని వాటి ధగధగల సొంపంతా శ్రీలక్ష్మీనరసింహస్వామికి సేవగా చెందుతోంది.

ఇదీ విషయం.

మరి, ఆరగింపు ముగించుకొని, అంత ధగద్ధగాయమానంగా కొలువు తీరి  లక్ష్మీసమేతుడై దర్శనం ఇచ్చిన స్వామివారు ఊరికినే ఉన్నారా?

ఉండరండి. దేవతల దర్శనమే అమోఘం. వారు మనకు కనిపించాక ఏదో ఒకటి అనుగ్రహించాలి మనకు. అది వారి రివాజు. సంప్రదాయం.

మరి దేవాధిదేవుడైన లక్ష్మీనారసింహుడు వట్టినే ఉంటాడా? ఉండడు కదా. అందుక వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు అన్నాడు అన్నమయ్య. అయన మనకు వరాలు అనుగ్రహిస్తున్నాడని చెబుతున్నారు.

ఆ లక్ష్మీనారసింహస్వామి వారి వైభవాన్ని ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.

    బంగారు మేడలోన పచ్చల గద్దియల మీఁద
    అంగనల ఆట చూచీ నల్లవాఁడె
    రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
    చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు


అది బంగారు మేడ. ఆ మేడ మీద ఒక గొప్ప సభాభవనం. దానిలో ఒక దివ్య మంటపం. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది.  ఆ గద్దె మీద స్వామివారు మంచి రంగైన సొమ్మలను అలంకరించుకొని కూర్చున్నారట. ఇక్కడ రంగగు అంటే మణిభూషణాలకు సంబంధించిన రంగురంగులు అని అర్ధం కాదు. రంగగు అంటే దివ్యమైన అద్భుతమైన అని అర్ధం. అటువంటి సొమ్ముల దిగవేసుకొని మహారాజవైభవంతో మరీ కూర్చున్నాడు స్వామి.

ఆయన మనకు చెంగటనే ఉన్నాడు అని హెచ్చరికగా చెబుతున్నారు ఆచార్యులు. అంటే మనం ఆ సభాభవనంలోనే అయనకు ఎదురుగా కొంచెం పెడగా ఉభయపార్శ్వాలనూ సభాసీనులమై ఉన్నాం అని చెప్పటం.

అలా గొప్ప సభతీర్చి కూర్చున్న స్వామి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే అంగనల ఆట చూచీని అనగా నట్టువరాండ్రు ఆయన యశోగీతాలు గానం చేస్తుంటే తిలకిస్తున్నాడట.

ఇదంతా స్వామి వారు ఆరగింపు ముగించుకొని కూర్చున సభలో జరుగుతున్న ముచ్చట.

ఇక్కడ నేనొక విషయం మనవి చేయాలి. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది అని నేను వ్యాఖ్యానం చేసాను కాని నిజానికి కీర్తనను పరికిస్తే పచ్చలగద్దియల మీఁద అంగనల యాట చూచీ అని కనిపిస్తోంది కదా అన్న అనుమానం వస్తుంది చదువరులకు. గద్దె లేదా గద్దియ అన్నమాటకు ఆసనం అన్న అర్దప్రతీతి ఉన్నది కాని వేదిక అన్న ప్రతీతి లేదు. ఆసనం మీద నాట్యం చేయటం అన్నది అసంగతమైన అన్వయం కదా. అందుచేత మనకు గద్దియ అన్నమాటకు వేదిక అన్న అర్ధం కావలసి వస్తున్నది. కాని అది పొసగదు. వాంగ్మయంలో కూడా గద్దెకెక్కటం అన్న నానుడికి అర్ధం సింహాసనం ఎక్కడం అనే అన్నది అందరికీ తెలుసు. కాబట్టి సభాంగణంలో పచ్చలవేదికల మీద నాట్యం జరుగుతున్నది అన్న అన్వయం తీసుకోవటం లేదు. స్వామి వారు బంగారు మేడలోన పచ్చల గద్దియ పైన ఆసీనులై ఉన్నారన్న అన్వయాన్ని తీసుకున్నాను.

ఐతే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును నాకు. అన్నమయ్యకు మెఱుగులు దిద్దటమా, ఉచితమా అన్నది. సభలో సింహాసనానికి ఎదురుగా నాట్యవేదిక ఒక్కటే ఉందనుకోవటం, అనేక నాట్యవేదికలు అలా ఉన్నాయనుకోవటం కన్నా ఎక్కువ సబబుగా ఉండటం కూడా ఒక కారణం అని ఒక సమర్ధన. మరొకటి, నా అభిప్రాయంలో పచ్చల గద్ధియ మీఁద అన్నదే మంచి పాఠంలా అనిపించటం ముఖ్యకారణం నా వివరణకు.

సాంకేతికాంశం ఒకటి ఉందిక్కడ.చరణాల్లోని రెండవపాదాలు మినహాయించి ప్రతిపాదంలోనూ ఉత్తరార్ధం అనగా యతిస్థానం నుండి పాదాంతం వరకూ కల భాగం పదిమాత్రల ప్రమాణంతో ఉన్నది. నేను చెప్పేది ఉఛ్ఛారణాప్రమాణం గురించి. వరుసగా ఇడుకొని కొలువిచ్చి,  శేషుని పడగ మీద,  క్ష్మీనారసింహుడు, రాజసపు విభవాల, పెనచి ఒక పాదము, కోరి యహోబలమున అన్నవి అన్నీ ఇలా పదిమాత్రల ఉఛ్ఛారణకు చక్కగా వస్తున్నాయి. కాని పచ్చల గద్దియల మీద అన్నప్పుడు పదకొండు మాత్రల ప్రమాణం అవసరం అవుతున్నది. పచ్చల గద్దియ మీద అంటే చక్కగా సరిపోతున్నది.

కాబట్టి పచ్చలగద్దియల మీద అన్నది వ్రాయసకాని పొరపాటే కాని ఆచార్యుల వారి రచనలో పచ్చల గద్దియ మీద అని ఉన్నదనే అభిప్రాయం స్థిరపడుతున్నది.

అలా నాట్యాది విలాసాలను తిలకిస్తున్న స్వామి వారి గురించి ఇంకా ఇలా చెబుతున్నారు.

    పెండెపు పాదము చాఁచి పెనచి వొ కపాదము
    అండనే పూజలుగొనీ నల్లవాఁడె
    కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
    మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు

ఆయన పాదాలకు గండపెండేరాలు ఉన్నాయి. అవి బ్రహ్మాండమైన శోభను వెదజల్లుతున్నాయి.  ఒక పాదం క్రిందకు పదపీఠంపైన ఆన్చి ఉంచారు స్వామి. మరొక పాదాన్ని మడత వేసుకొని ఉన్నారు. అప్పుడే కదా మరి అది అమ్మవారు అంకపీఠిపై కొలువు తీరటానికి ఆసనంగా అమరేది. అందుకని అన్నమాట.

ఈ లక్ష్మీనారసింహ స్వామి ఎవరను కుంటున్నారు?

సాక్షాత్తూ వేంకటాద్రి కొండల మీద వెలసి ఉన్న శ్రీ వేంకటేశుడే ఇతడు!

ఆయనే కోరికోరి ఇలా అహోబలం లో శ్రీలక్ష్మీనారసింహుడై వెలసి ఉన్నాడు.

చూడండి, ఈయన ఎంత గొప్పగా ఇక్కడ (అహోబిలంలో) ప్రకాశిస్తూ ఉన్నాడో!!