11, మార్చి 2020, బుధవారం

ఆరగింపవో మాయప్ప యివే పేరిన నేతులు పెరుగులును - అన్నమయ్య సంకీర్తన


ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును

తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును

పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెగలు
పరిపరివిధముల భక్ష్యముల

కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును

కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరాని యంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు

ఒడికవుఁ గూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా

ఇది ఆరవసంపుటం లోని సంకీర్తనం. ఇందులో, అన్నమాచార్యుల వారు వేంకటరమణుడికి ఆరగింపు నివేదిస్తున్నారు. చాలా భక్క్ష్య భోజ్యాదికాన్ని ప్రస్తావిస్తున్నారు. కొన్నింటిని చూదాం.

ముందుగా ఒక మాట.

ఈ సంకీర్తనం నాకు ఆర్కీవ్ డాట ఆర్గ్ లోనూయూట్యూబ్‍ లోనూ కనిపించింది. ఇది సుశీల, నాగేశ్వరనాయుడు గార్లు ఆలపించింది.  ఆపాతమధురమైన సుశీల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నాయుడు గారి గళం కూడా బాగుంది. ఐతే అదనంగా ఆరగింపవయ్యా అంటూ తరచూ వారి గానంలో వాడుక చేయటం నాకైతే అభ్యంతరం చెప్పదగిన విషయంగా అనిపించింది.  అదీకాక నాయుడు గారు పాటను పల్లవితో మొదలు పెడుతూ ఆరగించవయ్యా అన్నారు. ఏదో ఒక మాటనే వాడుక చేయాలి కదా అన్నది మరొక అభ్యంతరం.  అన్నమయ్య ఆరగింపవో అన్నప్పుడు పాటలో ఆద్యంతం అదే మాటను వాడుక చేయాలి. లేక పోతే మనం అన్నమయ్యకు మెఱుగులు దిద్ది ఆయనకే విద్య నేర్పినట్లు ఎబ్బెట్టుగా ఉంటుంది కదా.

ఈ సంకీర్తనలంలో అన్నమాచార్యుల వారు కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు అని మిరపకాయలను ప్రశంశించి చెప్పటం గమనించండి.

అన్నమయ్య జీవించిన కాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503 వరకు. ఈ సమాచారం వికీపీడియా నుండి స్వీకరించాను. అలాగే వికీపీడియాలో మిరపకాయ సమాచారం చూదాం. ఆపేజీలో "1493లో వెస్టిండీస్‌కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్‌కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా, మొట్టమొదటగా మిరపకాయలను స్పెయిన్‌కు తీసుకొని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్దం చేశారు." అనీ, ఆ తరువాత "స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది"  అనీ చూడవచ్చును. వికీపీడీయా ప్రకారం మిరపకాయలు మొదట భారతదేశంలోని పోర్చుగీసు కాలనీలకూ ఆతరువాత మెల్లగా ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.

ఈ కీర్తనలో అన్నమయ్య నేరుగా మిరియపు కాయలు అని మిరపకాయలను పేర్కొన్నారు కదా,  భారతదేశంలోని ప్రవేశించిన మిరపకాయ కేవలం 1494 - 1503 మధ్యకాలంలో తిరుమల దాకా వ్యాపించటం అంత నమ్మశక్యం కాదు. పైగా విశ్వామిత్రసృష్టి అని మనవాళ్ళు దూరం పెట్టకుండానూ, ఆగమశాస్తం తాలూకు అభ్యంతరాలు దాటుకొని పూజారుల మడి ఇళ్ళలో దేవుడి ప్రసాదంలోనికి అంత త్వరగా మిరపకాయలు దూరగలవా? మీరే ఆలోచించండి. నాకైతే నమ్మకం లేదు. బహుశః మిరపకాయలు ఆ పోర్చుగీసు వాళ్ళు పట్టుకొని రాకముందే మనదేశంలో వాడకంలోంకి వచ్చి ఉండవచ్చును అనిపిస్తోంది నాకు.

ఈ కీర్తనలో తెంకాయ అన్నమాట కనిపిస్తుంది. తెంకాయ అంటే టెంకాయ అన్నమాట, తెన్ అంటే దక్షిణాది అని అర్ధం. దక్షిణప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని కాబోలు ఈపేరు. అన్నట్లు తెనుగు అన్న మాటలో తెన్ కూడా ఇదే నట.

కరజికాయలు అన్నమాట కూడా ఉందిక్కడ. ఇప్పుడు మనం కజ్జికాయలు అంటున్నాం కాని పూర్వరూపం కరజికాయలు  అన్నమాట.

ఇక్కడ అంబాళపు కాయలు కనిపిస్తున్నాయి కదా అవి అడవిమామిడి లేదా నల్లమామిడి పండ్లు అన్నమాట. ఈ చెట్టును శాస్త్రీయంగా Spondias mangifera అంటారు.

ఇప్పుడందరూ ఇడ్లీ అని అరవమాటకు పెద్దపీట వేసేస్తున్నారు కాని మొన్నమొన్నటి వరకూ ఇడ్డెన్లు అనే అనే వాళ్ళం.

ఖండమండిగెలు అంటే పాలూ చక్కర గోధుమపిండితో చేసే భక్ష్యం అట. బహుశః మన గోరుమీటీల వంటివేమో.

ఈ సంకీర్తనాన్ని అన్నమయ్య బ్లాగులో కూడా చూడవచ్చును.

9 కామెంట్‌లు:


  1. ఆ మిరియపు కాయలు మిరియాలయుండ వచ్చు. మిరియాలు మన దేశవాళి కదా?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిరియాలు గింజలండీ. వాటిని అన్నమయ్య కాయలు అన్నా డనుకోలేము. మిరియపు కాయ అన్న మాటే మిరపకాయ ఐనది అన్న సంగతి జగద్విదితం.

      తొలగించండి
  2. ఆరుదైన కమ్మనైన అన్నమయ్య గీతం పరిచయం చెసినందుకు కృతజ్ఞతలు sir. సుకినప్పాలు. -- సుఖియలు అని పూర్ణం బూరెలను రాయలసీమలో అంటారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మయ్య పూర్ణం బూరెలూ దొరికాయి సంకీర్తనంలో! ఇకపోతే నూనెబూరెలు అంటే అవి మన పుణుగుల వంటివి అనిపిస్తోంది.

      తొలగించండి
  3. నోరూరించే సంకీర్తన!

    "సుడిగొను నప్పాలు సుకినప్పాలును"

    అప్పాలు తెలుసు కానీ సుకినప్పాలంటే పోలిక తెలియడం లేదు. సాబుదానా వడియాలా లేక సకినాలా, ఏమయుండవచ్చును సార్.

    "పాయరాని యంబాళపుఁగాయలు"

    ఇది కూడా ఓ పట్టాన అర్ధం కావడం లేదు, కుదిరితే వివరించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకినలు అన్నది బహుశః రాయలసీమ వారి సుఖియలు కావచ్చును. అంటే అవి పూర్ణం బూరెలన్న మాట. గారెలు చెప్పి బూరెలు చెప్పలేదేం అనుకున్నాను మొదట నేను కూడా.

      ఈ అంబాళపు కాయలను గురించి వివరించానే, మరొకసారి పరిశీలించండి. పాయరనివి అంటే విడిచిపెట్టలేనివి అని అర్ధం. అంటే ఆపండ్లు అంత బాగుంటాయి కాబోలును.

      తొలగించండి
  4. @GKK, @ శ్యామలీయం:

    "సుకినప్పాలు" పదానికి వివరణ ఇచ్చినందుకు థాంక్సండీ.

    అంబాళపు కాయల గురించి ముందు చదివిన్నప్పుడు మిస్సయ్యాను సారీ.

    రిప్లయితొలగించండి
  5. 550-600 ఏళ్ల క్రితం వ్రాయబడిన పాటలోని అనేక ఆహార పదార్థాలు ఇప్పటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి అంటే అది తరతరాలు గా తెలుగు సాంప్రదాయాన్ని పరిరక్షించుకున్నాము అని చెప్పాలి.

    వెర్రి బిరియాని కన్న పులిహోర కడుమిన్న.

    నానా రకాల మషాలాలు కలిపి చేసే
    దిక్కుమాలిన వంటకాలు ఈ రోజుల్లో తినవలసి వస్తుంది. హోటళ్లలో పెళ్ళిళ్ళలో 400 రు. ఖర్చుపెట్టి పెట్టే విందు భోజనాలు కంటే పండుగ రోజుల్లో మనం ఇంట్లో చేసుకొని తినే సాంప్రదాయ పిండివంటలు ఎంతో బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  6. ఆరగింపుల పైన మరొక అన్నమార్య గీతం sir.

    ఏ పొద్దు చూచిన దేవుఁ డిట్లానే యారగించు
    రూపులతోఁ బదివేలు రుచులైనట్లుండెను ॥పల్లవి॥
    మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు
    సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు
    ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను
    బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను ॥ఏపొ॥
    పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు
    వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు
    బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను
    అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను ॥ఏపొ॥
    పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును
    వండి యలమేలుమంగ వడ్డించఁగా
    అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ
    దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను॥

    ఇందులో వెలిగొండలు అన్న పదం విశేషంగా కనబడుతోంది.

    అలాగే అన్నమయ్య బాల్యం లో అమ్మవారిపై నాశువుగా చెప్పిన శతకము లోని పద్యము

    అరిసలు నూనె బూరియలు నేగులు జక్కెర మండెగల్ ... కూడా ఉన్నది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.