14, మార్చి 2020, శనివారం

అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు - అన్నమయ్య సంకీర్తనం


అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు

యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు


జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల

ఆనక కర్మేంద్రియము లైదు

తానకపుకామక్రోధాలవర్గములారు

యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు



తప్పని గుణాలు మూడు తనువికారములారు

అప్పటి మనోబుద్ద్యహంకారాలు

వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు

యిప్పటి మించే కోపము యెంచుకో మాపౌఁజు



ఆఁకలి దప్పియును మానావమానములును

సోఁకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు

మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ

యేఁకటార గడపేవా నెంచుకో మాపౌఁజు


ఈ సంకీర్తనంలో ఆచార్యుల వారు వేదాంతపరిభాషను వంకాయలో కారం కూరినట్లు దట్టించారు.
కొంత మందికి ముందుగా ఈ పరిభాష ( అంటే  terminology) ముందుగా పరిచయం చేయకపోతే వారికి అవగాహన కావటం కష్టం కాబట్టి ముందుగా ఆపదాల సంగతి చూదాం.

జ్ఞానేంద్రియము లైదు: 1. చర్మము, 2. కన్నులు, 3. ముక్కు, 4. చెవులు, 5.. నాలుక. వీటి వనన జీవి స్పర్శను, దృశ్యమును, వాసనలను, శబ్దమును, రుచిని గ్రహిస్తాడు.

కర్మేంద్రియము లైదు:  1. చేతులు, 2. కాళ్ళు, 3. వాక్కు, 4.జననేంద్రియము, 5. విసర్జనేంద్రియము.

కామక్రోధాలవర్గము లారు:  1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4.మోహము, 5. మదము, 6. మాత్సర్యము.

పంచభూతాలు: 1. ఆకాశము. 2. వాయువు, 3. అగ్ని, 4. జలము, 5. భూమి.

గుణాలు మూడు: వీటినే సాధారణంగా త్రిగుణా లని అంటాము,  ఇవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము.

తనువికారములు ఆరు:  1. పుట్టటం, 2. ఉండటం, 3.పెరగటం, 4. గిట్టటం, 5. తగ్గటం, 6. చెడటం.

మనోబుద్ద్యహంకారాలు:  1. మనస్సు, 2. బుద్ధి, 3. అహంకారము, 4. చిత్తము. ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ చతుష్టయం అంటారు.

విషయములు అయిదు: 1. స్పర్శ, 2. రసము, 3. రూపము, 4. గంధము, 5. శబ్దము.

ద్వంద్వములు: 1. ఆకలి - దప్పిక 2. శీతము - ఉష్ణము 3. సుఖము - దుఃఖము 4. చీకటి - వెలుగు 5. లాభము - నష్టము 6. జయము - అపజయము, 7. సన్మానము -  అవమానము మొదలైనవి.


సంకీర్తనం పల్లవిలో

    అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు

   యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు

అని మొదలుపెట్టారు. పౌఁజు అంటే బలగం. అనగా సైన్యం అన్నమాట. ఒడయడు అంటే రాజు. శ్రీపతివైన ఓ వేంకటేశా నువ్వేమో అన్నిటికీ ఏలికవు. ఐనా మా బలం ఏమంత తక్కువేం కాదయ్యా, కావలిస్తే వివరిస్తాను. నువ్వే లెక్కించుకో అని ఈ పల్లవి భావం.

ఇంక చరణాల్లో ఆ లెక్కా డొక్కా అంతా ఇల్లా వివరిస్తున్నారు.

మొదటి చరణం.

    జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల
    ఆనక కర్మేంద్రియము లైదు
    తానకపుకామక్రోధాలవర్గములారు
    యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు

అయ్యా ఈ లెక్క విను. ఈ శరీరి (శరీరం కలవాడు శరీరి అనగా జీవుడు) ఉన్నాడే, వీడికి జ్ఞానేంద్రియాలొక ఐదు ఉన్నాయి. అలాగే మరొక ఐదు కర్మేంద్రియా లున్నాయి. ఇంకా కామక్రోధాదులని ఒక వర్గం వాళ్ళొక అరుగు రున్నారు. ఈ వీడి శరీరాన్ని ఆశ్రయించుకొని పంచభూతాలని లొంగదీయరానివి ఒక అయిదు ఉన్నాయి. మా బలగాన్ని లెక్కవేసుకో వయ్యా.

రెండవచరణం.

    తప్పని గుణాలు మూడు తనువికారములారు
    అప్పటి మనోబుద్ద్యహంకారాలు
    వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు
    యిప్పటి మించే కోపము యెంచుకో మాపౌఁజు

ఈ జీవితో పాటుగా త్రిగుణాలని ఉన్నాయి. శరీరానికి  వికారాలని అవొక ఆరు ఉన్నాయి. అంతఃకరణ చతుష్టయం అని ఒక నలుగు రున్నారు. (ముగ్గురిని పేరుపెట్టి చెప్పారిక్కడ వారిలో) . వీరు కాక విషయాలని మరొక ఐదుగురు ఉన్నారు. అపైన కోపం అనే పెద్ద వీరుడొకడు. లెక్కపెట్టుకోవయ్యా మా సైన్యాన్ని.

మూడవ చరణం.

    ఆఁకలి దప్పియును మానావమానములును
    సోఁకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు
    మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
    యేఁకటార గడపేవా నెంచుకో మాపౌఁజు

ఈచరణంలో మూక అన్నా గమి అన్నా దండు అనే అర్ధం వస్తుంది కాని గమికాడు అంటే దండుకి అధిపతి అని తీసుకున్నాక మూక గమికాడ అంటే ఇంత పెద్ద దండుకు అధిపతిని అని గ్రహించాలి.

ఏకట అంటే ఇష్టం. ఏకటి + ఆర --> ఎంతో ఇష్టంగా (తనివార లాగా అన్నమాట)


అంతే కాదయ్యోయ్. ద్వంద్వాలని కొందరు జంటవీరులున్నారు. వాళ్ళ సంఖ్యా? ఓ. బోలెడు మంది సుఖమూ దుఃఖమూ, వేడీ, చల్లనా, ఆకలీ దప్పికా ఇలా లెక్కలేనంత మందున్నారు బలగం.

ఇంత దండుకి నేను సేనాపతిని. ఐనా నీకు దాసుణ్ణి. మ్రొక్కుతున్నానయ్యా నీకు వినయంగా.  ఎంతో ఇష్టంగా నీ సేవలో గడిపే వాడిని. నా సైన్యాన్ని ఎంచుకోవయ్యా. ఇదంతా నీదేను, నీ సేవకై ఉన్నదేను.


ఈ సంకీర్తనంలో ఇలా ఆచార్యుల వారు జీవుడిని ఆశ్రయించుకొని ఉన్న సమస్తమూ అతడి సైన్యం వంటిదనీ, దానితో వాడి భగవత్కైంకర్యం ఇష్టంగా చేస్తూ ఉన్నాడని చమత్కారంగా చెబుతున్నారు.

1 కామెంట్‌:

  1. అన్నమయ్య జన్మతః స్మార్త సంప్రదాయక నంద వరీక నియోగి. ఆచార్యుల ఆజ్ఞ చేత విశిష్టాద్వైత వైష్ణవ మతావలంబీకి అయినాడు.

    ఈ గీతములో శారీరక మానసిక లౌకిక వికల్పాలను అన్నింటినీ సైన్యము గా భావన చేసి వేంకటేశుని కి సంపూర్ణ శరణాగతి ప్రతిపాదించి నాడు.

    పౌజు అన్న పారశీ పదం ప్రజల నానుడిలో ఆనాటికి చేరి పోయింది. అన్నమయ్య వాడుక మాటలకు తన పదాలలో పెద్ద పీట వేశాడు.

    మీ వివరణ సముచితం గా ఉన్నది.

    ఒక విన్నపం.

    మీరు త్యాగరాజ ఘనరాగ పంచరత్న కృతులపై విపుల వ్యాఖ్యానం వ్రాయమని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.