21, సెప్టెంబర్ 2019, శనివారం

అందరను పట్టు మాయ


అందరను పట్టు మాయ యచ్చెరువుగ గో
విందునితో పలుకాడు విధము జూడుడు

నరుల సురాసురులను సరకుగొన కుందును
పరమేష్టిని కూడను పట్టుకొన నేర్తును
హరుని నీయాన బట్టి నట్టిదియు నుకలదు
పరమాత్మ నీవిచ్చిన ప్రభావంబు వలన

నన్ను పట్టవుగ యని నవ్వగ మాధవుడు
మన్నించు మని పలికె మాయ తానంతట
నన్నును పట్టవలెను నరుడనై రావణు
మన్నుజేయగ ధరను మసలు నాడనె హరి

నరునిగ నిన్ను నీవు మరచితే నెటులన
మరచియును రావణుని మట్టుబెట్టెద ననె
వరము నాకిడితి వని పలికి మాయె చనెను
హరియును శ్రీరాముడై ధర నవతరించెను