22, సెప్టెంబర్ 2019, ఆదివారం

సరగున రక్షించ నీకు సమయమే లేదా నరపతి నిన్ను నేను నమ్మితి గాదా


సరగున రక్షించ నీకు సమయమే లేదా
నరపతి నిన్ను నేను నమ్మితి గాదా

రామ రామ రామ యని ప్రేమతో స్మరించు న
న్నేమని పట్టించుకొనవు స్వామి చెప్పుమ
ఏమి వరము లడిగి నిన్నెప్పుడు విసిగించితిని
తామసించు చున్నావు దశరథాత్మజ యిటుల

మణులను నిన్నడిగితినా మాన్యంబు లడిగితినా
అణిమాదిక సిధ్ధులనే అర్ధించితినా
అణచుమంటి భవతాప మంతియే కాదటయ్య
గుణభూషణ యట్టులడుగ కూడదా చెప్పవయ్య

శరణు శరణు రామ యన చక్కగా కాచెదవని
ధరమీదను పేరువడ్డ దయాశాలివి
నరుడ నల్పుడను నిన్ను నమ్ముకొన్నవాడను
పరాంగ్ముఖుడ వైన నీ బిరుదమే చెడునయ్య

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.