21, సెప్టెంబర్ 2019, శనివారం

హరుని వింటి నెత్తితివట


హరుని వింటి నెత్తితివట యదియేమి వింత
హరియు హరుడు నొకటని యంద రెఱుగరా

అవతారము దాల్చితివట యదియేమి వింత
అవనికి మును వామనుడ వగుచు రాలేదా
అవురవురా నిన్ను నీ వస్సలెఱుగ కుండ
భువికి నీవు వచ్చుట మున్నెఱుగని వింత

అసురులను జంపితివట యది యేమి వింత
అసురులను జంపుట నీ కలవాటు కాదా
అసురపతి తొల్లి నీ యనుచరుడే నంట
కసిమసగ వాని నీవు కష్టపడుట వింత

హరుడు రామరామ యను నది యేమి వింత
అరయ నొకరినొకరు ధ్యానింతురు కాదా
నరుల కెపుడు శివుడు నీ నామమంత్రమిచ్చి
కరుణించగ కాశిలో కాచియుంట వింత