9, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు


ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు
గోట బుగ్గ మీటి యిచ్చి గోముగ కైకమ్మ పలికె

భూమిని విలుకాండ్ర లోన రామచంద్రు డధికు డని
రామబాణ మెపుడు ధర్మ రక్షణము చేయు నని
మేము విందుము రేపొమాపో మేనులు పులకించగ
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని

భూమిపైన రాకాసులు భూరిసంఖ్యలో నున్నారు
రామబాణములకు వారు రాలిపడెడు రోజువచ్చు
భూమిజనులకు నీవు రక్ష పొలుపుగ చేకూర్చగలవు
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని

శ్యామలాంగ చిన్నివిల్లు చక్కగ పైకెత్త వయ్య
కోమలాంగ రేపు గొప్పగొప్ప విండ్లెత్త గలవు
తామసుల పీచమణచి తాపసుల కావగలవు
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని