8, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా


ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా
పంతగించి పెడమోమిడి పలుకాడ విపుడు

పలుగాకుల సావాసము వలన చెడిపోతినా
నలుగురితో వాదులాడి నవ్వులపా లైతినా
విలాసములు మరిగి నీవిషయమే మరచితినా
పలుకవయా యెందుకయా పంతమిప్పుడు

తప్పుదారి పట్టి వేరుదైవమునే కొలిచితినా
తప్పులెన్ని సజ్జనులను తక్కువగా నెంచితినా
చెప్పరాని చెడుపనులు చేసి నవ్వుచుంటినా
చెప్పవయా పంతమేల చేసె దిప్పుడు

కొంతలో కొంత గతము గుర్తుచేసినది నీవు
చింత లిక తొలగునని చెప్పియున్నది నీవు
వింతలేమి పుట్టెనయా వేడుక మీఱగ నీవు
పంతగించి నేడెందుకు పలుక విప్పుడు