14, సెప్టెంబర్ 2019, శనివారం

ముందెన్నడో రామమూర్తివై నీవు సుందరి సీతకే సొంతమైతివని


ముందెన్నడో రామమూర్తివై నీవు
సుందరి సీతకే సొంతమైతి వని

ఇపుడు గుర్తుకు వచ్చి యిందరిలో నీవు
విపరీతముగ నొక్క పైదలి సత్యకె
యుపలాలనము సేసి యూరకున్నా వంటె
తపియించ కుందుమె తక్కిన సతులము

పిలచి పెండ్లాడిన కులసతి రుక్మిణి
చులకనయై తోచు చున్నట్లు తేలును
కులుకుచు నిందర గోపాల పెండ్లాడి
వలపంత సత్యకె పంచు టొప్పదయ్య

దాససంపోషక దాశరథివి నీవు
ఆ సీత వైదర్భి యన్నది నిజము
చేసికొంటివి నేడు చెలగి మమ్మందర
మోసగించకు నాటి ముచ్చట జెప్పి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.