24, జూన్ 2019, సోమవారం

విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా


విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా ఓ
నల్లనయ్య యిది యేమి యల్లరయ్యా

ఎన్నో తరాల నుండి యెనలేని యీ విల్లు
మన్నికగ నున్నదయ్య మాయింటి లోన
ఎన్నెన్ని పూజలందు కొన్నదో యీవిల్లు
చిన్న వాడ వెరుగవుగ శ్రీరామ చంద్రుడా

రేపు దేవతలు వచ్చి కోపగించెద రేమో
మీ పెద్దల కిచ్చినది మేలైన విల్లే
ఆపురారి పెనువిల్లే అపురూపమైనదే
యే పగిదిని పిల్లవాని కిచ్చినా వందురే

పూని యీ విల్లెత్తిన పురుషోత్తముడ వీవే
తానిది మున్నెత్తెను మా తనయ సీత
మానితమౌ ధనువు మిమ్ము మన్నించె నీరీతి
కాన నీకు సీత నిత్తు కాదన రాదయ్యా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.