8, జూన్ 2019, శనివారం

పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ


పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ రా
మన్న భజన కందర కాహ్వాన ముందండీ

పాడగల వాళ్ళందరు పాడవచ్చండీ
వేడుకతో మీపాటలు వినిపించండీ
ఆడామగా తేడా యేమానందముగా
కూడి రామకీర్తనలు పాడుకొందము

విజ్ఞులు విబుధులు వేదాంతజ్ఞులు
అజ్ఞానము తొలగ రామవిజ్ఞానమును
ప్రజ్ఞమీఱ పాడగా వారితో కలయుటే
సుజ్ఞానప్రదము కదా సుజనులారా

ఏమండీ మేము పాడలేమందురా
రామవైభవము చూడ రావచ్చుగా
ఈమంచి తరుణమున రామచంద్రుని
కామితార్ధప్రదుని వేడ రావచ్చును