13, జూన్ 2019, గురువారం

వీనుల విందుగా వినిపించనీ


వీనుల విందుగా వినిపించనీ
జానకీరాముడా సర్వవేళల

శ్రీనాథనామావళి శ్రేష్ఠంబగు నట్టిదౌ
ధ్యానముద్రలో శివుడు తడవుచుండు నట్టిదౌ
మౌనుల రసనలపై మసలుచుండు నట్టిదౌ
నీ నామకీర్తనము నీ భక్తులకు

యోగిరాజప్రస్తుతమై యొప్పుచుండు నట్టిదౌ
భోగీంద్రుడు వేనోళ్ళ పొగడుచుండు నట్టిదౌ
సాగరపుబిందువుల సంఖ్యదాటు నట్టిదౌ
నీగుణకీర్తనము నీభక్తులకు

యావత్ప్రపంచసృష్టి కాదిమూలమైనదౌ
యావత్ప్రపంచంబున కాధారమైనదౌ
భావనాతీతమై పరగుచుండు నట్టిదౌ
నీ విభవకీర్తనము నీభక్తులకు

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.