13, జూన్ 2019, గురువారం

మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో


మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో
హరినామము నాశ్రయించ వైతి విప్పుడు

ఎత్తి నట్టి జన్మంబు లిన్నిన్ని యనరాదు
తిత్తు లన్నింటను తెలివిడి లేమి
యెత్తి చూపించ దగిన యేకైక లక్షణము
నెత్తి నించుకంత తెలివి నిలచె నీ నాటికి

దొరకిన యీ జన్మమందు దొరుకక దొరకిన
యరుదైన తెలివిడి యన్నట్టి నిధిని
నరుడు వృధా చేసిన నాశన మగుగాక
మరల నరుం డగునట్టి మాటెంత నిజమో

హరేరామ హరేకృష్ణ యనుటేమి కష్టము
నరుడా హరికృప యమిత సులభము
పరమాత్ముని నామ మిపుడు పలుకకున్నచో
మరుజన్మము నందు పలుకు మాటెంత నిజమో

14 కామెంట్‌లు:

  1. బాగుంది. అయితే వృధా బదులు వృధ చేసిన అని ఉంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. Thanks. కానీ నేనడిగింది "బుచికి" గారు పైన సూచించిన "వృధ" అనే పదానికి అర్థం శ్యామలరావు గారు. లేక, రెండు పదాలూ ఒకటేనా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృధ అన్నా వృధా అన్నా ఒకటే నండి. ఉదాహరణకు జానకీనాయక శతకంలో
      "చనునే నామొరయాలకించక వృధాజాడ్యంబునుంజేయగా", "వృధగా జేయకు నాదుమొఱ్ఱవిను నిన్వేడన్ పరాకా", "వృధ దైవంబులగొల్చుటేమి ఫలమో" అనీ రెండు రూపాల్లోనూ ప్రయోగాలను తిలకించవచ్చును.అన్ని సందర్భాల్లోనూ అర్థం ఒక్కటే.

      తొలగించండి
  3. రఘుకులేశుడే ధర్మము వీడి
    మరో భామతో కూడిన నాడు
    నాదు జపము తపమూ
    నా కావ్యమ్మే "వృధ"యగునమ్మా
    సందేహించకుమమ్మా
    రఘురాము ప్రేమను సీతమ్మా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కగా గుర్తుచేసారు లవకుశ చిత్రంనుండి సముద్రాల రాఘవాచార్య గారి పాటను.

      తొలగించండి
    2. ఆఫ్ కోర్స్ నీహారిక గారూ. నాకు ఎంతో ఇష్టమైన పాట కూడానూ. ఇందాక ఎందుకు గుర్తు రాలేదో నాకే ఆశ్చర్యంగా ఉంది 🤔. థాంక్స్.

      తొలగించండి
  4. పై కీర్తనలో వృధ అని హ్రస్వంగా ప్రయోగించడమే సమంజస
    మనిపిస్తోంది . వృధాప్రయత్నం , వృధాప్రయాస అని సమాసగతమైనప్పుడు దీర్ఘంగానూ , వ్యస్తమైనప్పుడు హ్రస్వం
    గానూ ప్రయోగించడం కద్దు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది ఆలోచనీయమైన విషయం. కాని పాదంలో లయకోసం అక్కడ అలా అనటమే సరిపోతున్నది. ఒకవేళ పాఠంలో వృధ అన్నా పాడేటప్పుడు దీర్థాంతంగా ఉఛ్ఛరించ వలసి వస్తుంది.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. విరచితులు అన్నమాటను నేను వాడలేదండీ. విరచితము అన్న మాటకు నిర్మించబడినది అన్నది అర్థం. విరచితములు అన్న మాట ఉంది. కొన్ని రచనలను చెప్పి ఇవి ఫలాని వ్యక్తి చేత విరచితములు అనవచ్చును. కాని విరచితులు అన్నది సరైన మాటగా తోచదు. మీరీ మాటను నావద్ద ఎందుకు ప్రస్తావించారో తెలియదు!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.