24, జూన్ 2019, సోమవారం

వివిధవేదాంతసార విమలశుభాకార


వివిధవేదాంతసార విమలశుభాకార
రవికులాలంకార రామ నిర్వికార

అంగీకృతనరాకార హరి దయాపూర
సంగీతరసవిచార సమరైకశూర
సంగరహితమునిచర్చిత సత్యధర్మసార
శృంగారవతిసీతాసేవ్యశుభాకార

సురారాతిగణవిదార శోభనాకార
నిరుపమధర్మావతార దురితసంహార
పరమయోగిరాజహృదయపద్మసంచార
ధరాసుతాప్రియాకార వరశుభాకార

శ్రీకాంతాహృద్విహార చిన్మయాకార
సాకేతపురవిహార సజ్జనాధార
పాకారిప్రముఖవినుత భక్తమందార
శ్రీకర త్రిజగదాధార శ్రీరఘువీర

4 కామెంట్‌లు:

 1. https://bulususubrahmanyam.blogspot.com/2019/06/blog-post.html?showComment=1560897039589#c1159857647285115392

  మీరు రాముని మీద ఆన అని అన్నారా ? ఇంతోటి కమెంట్లకు రాముని మీద ఆన అవసరమా ?

  ఎక్కడికో వెళ్ళి మీరు మహర్దుర్దశా యోగం తెచ్చుకోవడం ఎందుకు ? సదరు బ్లాగర్లు మీకు నీతులు చెప్పడం ఎందుకు ? మీరు మీ బ్లాగులోనే చెప్పదలుచుకున్నది చెప్పవచ్చును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీహారిక గారు,

   అపోహ పడుతున్నారు. జిలేబీ గారిలాకవిత్వం వ్రాసే దుర్దశ నాకు ఎన్నడూ కలుగకుండు గాక యని రామచంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను అనటంలో రాముని మీద ఆనపెట్టటం ఏమీ లేదండి.

   బులుసు సుబ్రహ్మణ్యంగారు ఇటువంటి వ్యాఖ్య నా వద్దనుండి తమ బ్లాగులో ఊహించలే దన్నారు. రాకరాక నావద్ద నుండి వచ్చిన వ్యాఖ్య వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షంతవ్యుడిని. జిలేబీ గారిలా కవిత్వం చెప్పటం అన్న ఊహయే అసంబధ్ధంగా అనిపించి నా అభిప్రాయం చెప్పాను. అలా చెప్పకుండా ఉండవలసిందేమో. బ్లాగుల్లో ఉండటమే మహర్దుర్దశా యోగంగా మారుతున్న రోజుల్లా అనిపిస్తోంది. మరింత జాగ్రత వహిస్తాను. మౌన ముత్తమభాషణమ్ అని పెద్దలు ఊరకే అనలేదు.

   తొలగించండి
 2. ధరాసుతాప్రియాకార' కంటే
  'ధరసుతా ప్రియాకార' బాగుంటుంది కదండీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరశర్మ గారు, ఈ వ్యాఖ్యను మీరు మూడు సార్లు పంపటం అవసరం కాదు. అదటుంచండి. ధరాసుతా అన్నదే సరైన ప్రయోగం. ధరసుతా అనరాదు. ధరాసుతా అన్న పిమ్మట ఎడం ఇచ్చి ప్రియాకార అని వ్రాయకుండా కలిపి ధరాసుతాప్రియాకార అని వ్రాయటం సరైనదే. సంస్కృతభాషానియమం ప్రకారం ఒక సమాసంలో పదాలన్నీ ఎడంలేకుండా కలిపివ్రాయాలి. ఈ మధ్యకాలంలో దీర్ఘసమాసాలలో కొంచెం ఎడం ఇచ్చి కొందరు వ్రాస్తున్నారు కానీ అది సంప్రదాయం కాదు.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.