16, డిసెంబర్ 2019, సోమవారం

ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట


ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట
రవికులోద్భవుడ నన్ను రాము డందురు

హరు డెవ డనుకొంటివిరా యపచారము చేసితివి
హరదేవున కతిభక్తుడ నయ్యా పరశురామ
హరభక్తుడ వైన నీవు హరుని విల్లు విరతువా
విరచితినా యెక్కుపెట్ట విరిగె నంతే కాని

హరచాపము నెక్కుపెట్టెడు నంతటి భుజశాలివా
హరిచాపం బిదె యెక్కిడి శరమును సంధించుమా
హరిచాపము నెక్కిడితిని శరము నిదే సంధించితి
పరశురామ శరమెక్కడ వదలమందు వయ్యా

పరశురామునకు గర్వభంగం మొనరించితివి
శరమున నాపుణ్యమెల్ల క్షయము చేసెదవు గాక
వరవిక్రమ రామచంద్ర పురుషోత్తమ హరిసన్నిభ
స్థిరమగును నీ కీర్తియు సీతారామ సెలవు

4 కామెంట్‌లు:

 1. రామ పరశురామ సంవాదంతో ఒక పదం కూర్చడం చాలా బాగుంది. ఇది ఒక విశిష్ట ప్రయోగం గా తోస్తుంది. చదివిన తరువాత రామ పరశురాముల ఘట్టం కట్టెదుర కళ్ళకు కట్టిన అనుభూతి కలిగింది.

  రిప్లయితొలగించండి
 2. పదం చివరగా సీతారామ అనే నామ ప్రయోగం చాలా సముచితంగా ఉన్నది

  రిప్లయితొలగించండి
 3. పరశువు కోదండ హలము
  లరయంగా రాము డనగ హరి ధరియించెన్
  ధరియించి చెడును దునిమెను
  పరమాత్మను గొలచి జనము పరవశ మందెన్ .

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.