28, డిసెంబర్ 2019, శనివారం

మరా మరా మరా మరా మరా అని


మరా మరా మరా మరా మరా అని జపము చేసి
అరెరే ఒక బోయవా డైనా డొక గొప్ప ఋషి

తిరుగవేసి చదివినా పరమమంత్ర మతడికి
సరిసాటి లేని గొప్ప సత్ఫలము నిచ్చెను
మరి తెలిసి జపము చేయు మనిషి కేమి ఫలమో
పరగ మీరు దానిని సంభావించ లేరా

పరమసత్యమయా రామ భగవానుని నామము
పరమశివుడు పరవశించి ప్రశంసిచును
నరులారా రాముడే నారాయణు డని తెలిసి
పరమపదము పొంద సంభావించ లేరా

తెలిసి తెలియ నట్టి జపము దివ్యఫలము నిచ్చెను
తెలిసి తెలిసి మీరు జపము సలుప కుందురా
అలనా డాబోయ రామాయణమునే యెఱిగెను
పలికి పలికి మీరు మోక్షపథ మెఱుగలేరా


14 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. కొంచెం తెలుగు భాషలో చెప్పగలరా దయచేసి.

   తొలగించండి

  2. అనగా దారిన పోయే దానయ్యలకు కూడా పనికి రానిది అని అర్థము

   తొలగించండి
  3. అభిప్రాయం చెప్పినందుకు బుచికి గారికి, విశదీకరించి నందుకు జిలేబీ గారికి ధన్యవాదాలు

   తొలగించండి
 2. చిన్నప్పుడు మా హిందీ మాష్టారు ఈ స్టొరీ చెప్పిన్నప్పుడే నాకో సందేహం వొచ్చింది "మరా" అని అనడమెందుకు? ఒక్కసారే "రామ" నే నేర్పొచ్చుకదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంటే మహర్శులు రామ నామమే ఉపదేశించి జపం చేయమని చెప్పి ఉండవచ్చును. జపం చేస్తున్నప్పుడు సరిగా పలుకకపోవటం వలన అది ఒక్కొక సారి మరా మరా అన్నట్లుగా వినిపించేలా జపం చేసి ఉండవచ్చును. పదానికి పదానికి మధ్యన సరైన వ్యవధానం ఇవ్వకపోవటం అన్నది ఐతే అజ్ఞానం వలన జరుగవచ్చును లేదా నిర్లక్ష్యం వలన జరుగవచ్చును. ఇక్కడ బోయకు సరియైన భాషాజ్ఞానం లేదు కాబట్టి అతడు పలికేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటుగా వర్ణవ్యత్యస్తం చేస్తున్నానని తెలుసుకోలేదు. కాని భక్తియే ముఖ్యం కాబట్టి చివరకు అతడికి మంచిఫలితమే లభించింది.

   ఇది కేవలం కథ. నిజానికి అయన ప్రచేతసుడు అనే ముని యొక్క కుమారుడు. చిన్నతనం నుండి దుర్వృత్తికి అలవాటు పడి దారితప్పి తిరిగాడు. చివరకు రామనామంతో మరలా సరైన ధోరణిలోనికి వచ్చాడు. మరా అన్నాడని చెప్పలేం. కాని అలా జనశ్రుతి అంతే. హింసామార్గం నుండి సాధుజీవిగా మునివరేణ్యుడిగా మారాడు. నిజానికి మానిషాద శ్లోకం హింసను నిరసించేదే కదా. అదే రామాయణ రచనకు దారితీసింది.

   అందుచేత ఒకదారినిపోయే దానయ్య అనాగరికుడిగా హింసోన్మాదిగా కనిపించినా సాధుపురుషులు అతడిలోని ఆత్మజ్యోతిప్రకాశాన్నే చూసారు. రామనామం ఉపదేశించారు. రామాయణం వెలిసింది. రాముడి గురించి లోకం మరింతగా తెలుసుకొన్నది. తద్వారా ఎందరో తరించారు. తరిస్తున్నారు.

   తొలగించండి
 3. ఇప్పుడే ప్రచేతసుడి కథ చదివాను. మరో నీచమైన కథ...

  రిప్లయితొలగించండి
 4. https://telugu.pratilipi.com/read/%E0%B0%85%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE-89-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B0%B8%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-s8dv15I3T6lP-5752rkp12521062

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునా-89-ప్రచేతసుడు అన్న దిక్కుమాలిన కథను మీ పుణ్యమా అని చదివి చూసాను. అందులో ఒకానొక అణిముత్యం చూడండి "ఒకసారి సప్త ఋషులు దారి తప్పి అడవి గుండా ప్రయాణించసాగారు". సప్తఋషులేమిటీ వాళ్ళు దారితప్పటం ఏమిటి. వాళ్ళకు తెలియనిది ఏదీ ఉండదు కదా? ఇంత చిట్టిబుఱ్ఱ రచయిత ఏదో తోచింది గిలికితే అది ప్రామాణికం అన్నట్లు భావించి ఏకంగా వాల్మీకి మహర్షి తండ్రి ప్రచేతసుడి కథ నీచం అనటం ఏమిటి? ఏమీ బాగోలేదు.

   తొలగించండి
  2. సహజంగానే మన కథలెప్పుడూ లాజిక్లకి అందవుకదా.. వాళ్ళు తప్పిపోయినవి కూడా కలిపే.. నీచం అని అన్నాను. మరి సరైనదేదో మీరు చెప్పండి.

   తొలగించండి
  3. నయం. నేను చెప్పబోయేది కూడా కలిపి అనలేదు. వాదనలు కొనసాగిస్తూ పోతే, రాము డున్నాడనీ ఋజువులు చూపమంటారేమో.

   రామ కీర్తనం పైన ఈరగడ అంతా అవసరమా? ఇంకా చాలిద్దాం.

   తొలగించండి
  4. సరైనదేదో మీకు కూడా తెలియదని చెప్పడంలో మీ విలువ ఏమాత్రం తగ్గదులేండి. దాన్ని తప్పించుకోడానికి మీరే మాటర్ రాముడి అస్థిత్వం దగ్గరకి తీసుకెల్తున్నారు..

   తొలగించండి
  5. చిరు గారు,
   మౌన ముత్తమ భాషణం.
   ధన్యవాదాలు.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.