26, ఏప్రిల్ 2016, మంగళవారం

యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్ గురించి.

నేను మా మావయ్యగారు ప్రసాద్ గారికి లేఖ ద్వారా పంపిన ప్రశ్న.

మావయ్యా,

శంకరయ్యగారి సందేహం చూడు-

http://kandishankaraiah.blogspot.in/2016/04/2014.html?showComment=1461583716252#c408472515155664534

యముఁ గని జనులెల్ల మోద మందెదరు భువిన్.
ఈ సమస్యలో ప్రథమాక్షరం య అన్నది పద్యము గద్యము కావ్యము వంటి మాటల్లో ఉన్న య కారం కావచ్చునా అన్నది ప్రశ్న.
కాకూడదని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు కావచ్చును. నేనేమీ పండితుణ్ణి కాదు కదా.
కానీ, గుండువారు అలాంటి పూరణలు చేసాక శంకరయ్యగారికే శంక కలిగింది!
నివృత్తి చేయవలసింది.
భవదీయుడు,
శ్యామలరావు.







నా లేఖకు మా మావయ్యగారు శ్రీప్రసాద్ గారి సమాధానం చూడండి.

prasad atreya

10:39 PM (12 hours ago)


to me

చిరంజీవి శ్యామలరావునకు,
అలా పూరించుట సరి యైనదే.

సంధి గతము గా పూరించుట, ఒక అక్షరము కలిపి వేరే అర్థము తెచ్చుట,
ఇచ్చిన సమస్యను ఉత్ప్రేక్ష, ఉపమాన, రూపక, అర్థాంతరన్యాసములుగా చేయుట,
ఇచ్చిన సమస్యలో పదముల విఱిచి క్రమాలంకారము చేయుట,
ఇచ్చిన సమస్యను పద్య మధ్యమము నకు తెచ్చి అర్థము కల్పించుట
ఒప్పిదములే.
1) 'వంగము మీకు నెన్నడును సంతసమే కద బంటు లైననున్
ఇది ఇప్పుడు ఉదాహరణకు నేను సృష్టించిన సమస్య.
ఇందులో యతిభ్రంశము కూడ అయినది.
'పరిష్వంగము మీకు' అని సంధిగతముగా పూరించవచ్చు.

2) కుంజర యూధంబు---అర్థాంతరన్యాస పూరణ.

3) కోడిని తినె--పకోడిని తినె --అక్షరము కలుపుట

4) 'గంగా సుతు డాడె పెండ్లి కన్యా మణులన్!'
ఇది కూడ  ఇప్పుడు నేను సృష్టించిన సమస్య;--- ఉదాహరణ కోసము.
. --ఇది క్రమలంకారములో సులభ సిద్ధము.
కాని, 'కలుగంగా--' అని కూడ చేయ వచ్చు.
5) మంచిని వీడి నెయ్యమున మానవు లౌచు వసింపరే భువిన్.
ఇది కూడ, ఇప్పుడు నేను సృష్టించిన సమస్య.'మంచిని వీడి' దగ్గర comma పెట్టేస్తే సమస్య తేలిపోతుంది.
'మోసము చేయకుండగా  మంచిని వీడి,' అని. 
అట్లు కాక, మానవుడిగా ఉండుము' అని పూరించ వచ్చు.  
6) ప్రాలేయాంశువు బోలె మధ్య దివసార్కద్యోతమానాంగియై.
ఇది నేను ఒక సారి training కోసము ఇచ్చిన సమస్య.
చాల కష్టము పూరించుట.  'చంద్రుని వలె నుండి, సూర్యుని వలె ప్రకాశించెను.'
దీనిలో 'ప్రాలేయంశువు'  నకు అర్థము 'చంద్రుడు' అని కాక, 'కర్పూరము' అని
తీసికోంటే, తేలిక.
ఆ విద్యార్థులు, సత్యభామ నరకాసురునితో యుద్ధము లో వర్ణన తీసికొని
పూరించారు. (చాటువు మాత్రమే, సభలో కాదు.)   
నా పూరణ. 
శా:  బాలాదిత్య సహస్ర తుల్య విలసత్ వర్ష్మంబునన్ బూని స
      చ్ఛీలాత్యంత తపః ప్రభావ జనితాక్షీణోగ్ర కీళావళీ
      లీలాడంబర వహ్ని తేజముల నాళీకాక్షి మండెన్ వెసన్
       ప్రాలేయాంశువు బోలె మధ్య దివసార్కద్యోత మానాంగియై.   
ఇందులో 'ప్రాలేయాంశువు' అంటే 'కర్పూరము'.
వేదవతి తనకు తాను ఆహుతి అగుట.
సూర్యుని  యెవరూ రగిలింపరు, తనకు తాను తేజము పొందుతాడు.
వేదవతి కూడ బాలభానుని వలె నున్నది.
క్రమముగా మధ్యాహ్ణ సూర్యుని వలె మండినది.
రావణునకు చేతిలోని కుంతలములు తప్ప, పట్టుకొనుటకు
ఏమీ మిగుల లేదు. ఆమె కర్పూరము వలె మండి పోయినది.
ఇది నా 'పద్మావతీ కల్యాణము' లో పద్యము.
7) 'జిత మండూక ప దాకు లాప గలవే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.'
ఇది  ఒక అవధానికి ప్రసంగవశముగా ఇచ్చి పూరించ మన్నాను.
ఆయన చాలసేపు ఆలోచించి, 'చాల కష్టము గా ఉంది గురువుగారు' అన్నారు.
ఇది నా పూరణ.
మ.   క్షితిపై వాహిను లెల్ల పంకములతో చెల్వాఱినన్ జూచుచో
         అతి దాక్షిణ్యంబున దేవతలు వర్షాంతంపు కాలంబునన్
         ద్యుతితో రాల్చెడు నిండుబో యన అగస్త్యోద్య ద్రుచుల్ వెల్గె, గ
         ర్జిత మండూక పదాకు లాపగల వే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.
గర్జిత + మండూక + పద + ఆకుల + ఆపగల+ వే + సిద్ధింపగన్ + స్వచ్ఛతల్.
ఆకుల = కలచివేయబడిన 
ఆపగల = నదులలో

అగస్త్య తార, ఎలా ఉన్నదంటే,  దేవతలు, మండూకములచే
బురద బురదైన నదులను వర్షాంత కాలమున
తేర్చుటకు రాల్చు, ఇండుబు కాయా అన్నట్లు ఉంది.
ఇందులో కొంత ఎఱ్ఱనామాత్యుని ప్రయోగము వాడాను.
(అతి గాంభీర్య విభూతి..  అనే పద్యము ఆధారము )
ఇక్కడ, నీవు 'యము'-- ని, -- 'కావ్యము, పద్యము, etc'  గా ఉదహరించి నట్లుగా,
'జిత' ను 'గర్జిత' అని చేసా.
ఆశీస్సులతో,
మావయ్య


ఇటువంటి సమస్యాపూరణకు పూర్వకవి చేసినది ఒక ఉదాహరణ చూపుతాను.

సమస్య. మతిలేని నరుండు మిగుల మన్ననన నొందున్

దీనికి మోచర్ల వెంకన్న అన్న కవి రాజసభలో చేసిన పూరణ ఇలా ఉంది.

కం. హితమాచరించు వారికి
హిత మొనరించుచును   సుజన హితుఁ డగుచును దు
ష్కృత మెప్పుడుఁ జేయను స
మ్మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్


ఇక్కడ సమ్మతి అనేదానిలో విరుపు ఉండంటారా? కావచ్చును. ఇంకా శోధించాలి ఉదాహరణలకు.

పైన ప్రసాద్ గారు చేసిన పూరణ కొంచెం క్లిష్టంగా ఉంది కదా. నా కోరిక మేరకు మనకోసం ఆయన ఇచ్చిన వివరణ ఇదిగో

మ.   క్షితిపై వాహిను లెల్ల పంకములతో చెల్వాఱినన్ జూచుచో

         అతి దాక్షిణ్యంబున దేవతలు వర్షాంతంపు కాలంబునన్

         ద్యుతితో రాల్చెడు నిండుబో యన అగస్త్యోద్య ద్రుచుల్ వెల్గె, గ
         ర్జిత మండూక ప దాకు లాపగల వే సిద్ధింపగన్ స్వచ్ఛతల్.
భూమిపై, నదులన్నీ, బురదతో నిండినవై, (వర్షర్తువు చేత) చెలువు కోల్పోగా,
(నీలము గా అందముగా ఉండేవి ఎఱ్ఱ బడిపోయి) ; చూసిన దేవతలు దయతో 
వర్షర్తు వాంతమున (శరదృతువు నందు), మెఱయుచున్న ఇండుబ కాయ
(నీరు తేర్చుటకు సాధనము-GEL) రాల్చుచున్నారేమూ అన్నట్లు (అగస్త్య+ ఉద్యత్ + రుచుల్ )
అగస్త్య నక్షత్రము పొడుచునప్పుడు కాంతులు వెలిగెను.
గర్జిత = బెక బెక లాడు ,
మండూక =కప్పల
పద = కాళ్ళచే
ఆకుల = కలచి వేయబడ్డ
ఆపగల = నదులలో (ఆపగాః =నది)
వే = వెను వెంటనే

సిద్ధింపగన్

స్వచ్ఛతల్.
అగస్యోదయము అయ్యే రోజు, వేళ, పంచాగములలో కూడ ప్రత్యేకముగా
ఇవ్వబడును. ఆనాటి నుండి, నదులు తెలి నీటి తో ప్రవహిస్తాయి.
అందుచే, నేను 'అగస్త్య నక్షత్రమును' ఇండుబ కాయ తో పోల్చాను!
చాలా అందముగా వ్రాసా! దీన్నే 'ఆత్మ స్తుతి' అంటారు!
నీకు వీలు ఉంటే, కంది శంకరయ్య గారికి కూడా వినిపించు ఈ పద్యాన్ని.
ఆయన అభిప్రాయము తెలియపర్చు.
దీనిలో, ఎఱ్ఱన పద్యాన్ని కొంత అనుసరించా!
అతి గాంభీర్య విభూతి నేక చుళికా హంకార నిశ్శేష శో
షిత పాథోధి పయస్కుడైన ముని తోచెన్ పుణ్య తేజో మయా
కృతి, నయ్యామ్య దిగంత వీథి, ప్రకట క్రీడా కళాగర్వ గ
ర్జిత మండూక కళంకి తాంబు శుచితా సిద్ధ ప్రదాచార్యుడై.


శంకరయ్యగారు తమ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను.

14 కామెంట్‌లు:

  1. నా సందేహం తీర్చడమే కాక సమస్యాపూరణల విధానాలపై సమగ్రమైన పాథాన్ని బోధించిన మీ మామయ్య శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారిని, ఆ పాఠాన్ని సహృదయంతో అందించిన మీకు ధన్యవాదాలు. దీనిని ఒక పోస్టుగా ‘శంకరాభరణం’ బ్లాగులో పెట్టడానికి అనుమతించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతం నాకు ఉన్న పరిస్థితుల్లో సమయాభావం కారణంగా సమాచారాన్ని సరిగా క్రోడీకరించి ఇవ్వటానికి వీలు కాదని, మా ఉత్తరప్రత్యుత్తరాలను అలాగే ప్రచురించాను అందరి సౌకర్యార్థం. మీరు శంకరాభరణం బ్లాగులో ప్రచురించటం వలన మరింత మందికి ఉపయోగంగానూ చేరువగానూ ఉండే అవకాశం తప్పకుండా ఉంది. అలాగే ప్రచురించండి. ఈ సందర్భంగా పూర్వకవి ప్రయోగాలపైన పరిశీలన చేయటానికి నాకు సమయం లేదు. వీలైతే మీరు ఆ విషయం కొంచెం చూస్తే మరింతగా ఉపయుక్తంగా ఉంటుంది సమాచారం అనుకుంటాను. మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలు.

      తొలగించండి
    2. >దీనిని ఒక పోస్టుగా ‘శంకరాభరణం’ బ్లాగులో పెట్టడానికి అనుమతించవలసిందిగా ...
      మిత్రులు శంకరయ్యగారు ఈ విషయంతో‌ టపా ఎప్పుడు వెలువరిస్తారా అని ఎదురుచూస్తున్నాను.

      తొలగించండి
  2. చాలా ధన్యవాదములండి శ్యామల రావు గారు. నిర్ద్వందముగా నివృత్తి చేశారు మా సందేహాలను.

    రిప్లయితొలగించండి
  3. సోదాహరణంగా అద్భుతమైన పాఠాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారికి నమస్కారములు.
    'గంగా' అనే పూరణను 'కలుగంగా' అని పూరించ వచ్చన్నారు . అలాగే 'పదిలంగా' అనే మాట సాధువంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'పదిలంగా' అన్నది సాధువు కాదండీ. పదిలంబుగ, పదిలంబుగన్ పదిలంబుగా అన్న రూపాలు సాధువులు. వాటిని సందర్భోచితంగా వాడుకోవచ్చును.

      కాని, 'కలుగంగా' సాధువేను. కలుగన్, కలుగంగన్, కలుగంగా అని ఇష్టరూపాన్ని సందర్భానుసారం వాడవచ్చును.

      తొలగించండి
  5. మాకు గల యనుమానమును నుదాహరణ పూర్వకమ్ముగ దీర్చినందులకు ధన్యవాదములు శ్యామలరావు గారూ! మీ మామగారు గౌ. ప్రసాద్ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేయగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ విషయంపై వచ్చిన మిత్రుల స్పందనను మా మేనమామ ప్రసాద్ గారికి తప్పక తెలియజేస్తాను.

      తొలగించండి
  6. మధుర,బృందావనం,గొకులంగోవర్ధనం - వీటన్నింటికి కలిపి ఉన్న పేరు వ్రజభూమియా వజ్రభూమియా?నాకు వ్రజభూమి అని అంటారని తెలుసు,ఆని ఒక ప్రాజెక్టులో రెఫరెన్సు కోసం చూస్తుంటే ఒక చోట పదే పదే వజ్రభూని అని కనిపిస్తున్నది,అందుకే సందేహం వస్తున్నది.గూగుల్ సెర్చిలో కూడా సనదెహనివృత్తి జరగలేదు.కొంచెం విశదీకరించగలరు!వ్రజ అనేదానికి వికృతులైన రూపంతో బ్రిజ్ నందన్,బ్రిజ్ కిషోర్ లాంటి పేర్లు కూడా ఉన్నాయి,వ్రజభూమి అన్నదే వాస్తవం కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రజము అన్న పదానికి జనసమూహం అన్న అర్థంతో పాటుగా పసువులమంద అన్న అర్థం కూడా ఉంది. శ్రీకృష్ణాష్టోత్తరశతనామావళిలో ఓం నందవ్రజ జనానందినే నమః అని ఒక నామం కూడా ఉంది. ఇక్కడ నందవ్రజం అంటే అర్థం నందుని యొక్క వ్రజము అంటే పరివారం, ప్రజలూ అని. నందవ్రజ శ్రేణిపై బరగం గల్గు భవత్కృపారసము అని కృష్ణశతకం. అన్నమాచార్యుల వారి 'కొండ చూతము రారొ కొండొక తిరుమల కొండ' అన్న సంకీర్తనంలో ఆయన 'ఇదియె నందవ్రజ మనుచును మరి యిది దా నయోద్య యనుచు' అంటారు. ఇక్కడ నందవ్రజం అన్న మాటకు నందుని జనసమూహం నివసించో చోటు అన్న అర్థం వస్తున్నది. ఇలా వ్రజశబ్దానికి స్థలనిర్దేశనమూ కూడా కనబడుతోంది. కాబట్టి వ్రజభూమి అన్న దానికి (నంద)వ్రజం ఉండే ప్రదేశం అనే రూఢార్థప్రతిపత్తి ఉన్నది. వ్రజం అన్నది ఇక్కడ రూఢంగా నందవ్రజం అని గ్రహించాలన్నమాట. మీరన్నట్లు హిందీవాళ్ళ హింసకు వ్రజ శబ్దం బ్రిజ్ అవ్వచ్చును. ఇకపోతే వజ్రభూమి అన్న మాటకు ఈ సందర్భంలో ఎక్కడా స్థానం పొసగదు. అది పొరపాటుమాట.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.