1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఈశ్వర నీవే యిచ్చినది . . . .

   



ఈ యానందము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ యుత్సాహము నీ  కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ నిర్మోహత నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ నిస్సంగత నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ విజ్ఞానము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది
ఈ వైరాగ్యము నీ కెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ శమ మీదమ మివి యెక్కడివి
   ఈశ్వర నీవే యిచ్చినవి
ఈ శాంతమనఃస్థితి యెక్కడిది
    ఈశ్వర నీవే యిచ్చినది

ఈ రామజపం బిది యెక్కడిది  
    ఈశ్వర నీవే యిచ్చినది
ఏరా గడితేరితి విక పోరా
    ఈశ్వర అంతా నీ దయరా



9 కామెంట్‌లు:

  1. సార్ అందరికీ అర్ధం అయ్యేటట్టు సరళమయిన భాషలో బ్రహ్మాండమయిన సందేశం ఇచ్చారు చాలా బాగుంది!

    ఒక చిన్న సందేహం. "నీ కెక్కడిది" అనడం సరియేనా? ఈశ్వరుని నీవు అంటున్నప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని పొందిన మనిషిని కూడా నీవు అనవచ్చా? వీటిని "నా కెక్కడిది" లేదా "ఇదెక్కడిది" అంటే బాగుండదా?

    నాకు కవివంలో ప్రవేశం సున్నా. వ్యాఖ్యలో తప్పులుంటే మన్నిచండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారూ,

      మీకు నచ్చినందుకు సంతోషం. మీకు కలిగిన సందేహం మరికొందరికి కూడా కలుగవచ్చును. కాబట్టి దానిని నివృత్తి చేయటం‌ ఉచితంగా ఉంటుందని చిన్న వివరణ వ్రాస్తున్నాను.

      ఈ కృతి ఒక జీవేశ్వరసంవాదగీతం. అంటే జీవుడికీ, ఈశ్వరుడికీ‌ మధ్య నడచిన ఒక చిన్న సంభాషణకు గీత రూపం అన్నమాట.

      జీవుల్ని స్థూలంగా పామరులు, ముముక్షువులు అని విభజించవచ్చును. అంటే ఆథ్యాత్మికదృష్టి లేక కేవలం బ్రతకటం కోసం‌ బ్రతకటం‌ అన్నట్లుగా ఉండే వారూ, ఆథ్యాత్మికదృష్టిని కలిగి మోక్షాన్ని కోరి దానికోసం కృషిచేసేవారూ అన్న రెండు రకాలుగా జనం ఉంటారన్నమాట. ఈ‌ ముముక్షువుల్లో అనేక స్థాయీబేధా లుంటాయి కాని స్థూలంగా సాధనలో ఉన్న వాళ్ళూ, పరిపక్వత చెందిన జీవన్ముక్తులూ అని రెండు రకాలు అనుకోవచ్చును.

      సాధకుడి సాధన పరిపక్వం ఐనదా లేదా అని ఈశ్వరుడు నిత్యం‌ పరీక్షించుతూ‌ ఉంటాడు. ఆ పరీక్షలన్నీ జీవుడి మేలు కొరకే నుమా. పిల్లవాడికి చదువు ఎలా వస్తున్నదీ తల్లి నిత్యం పరీక్షించి చూచుకోవటం వంటిదే ఈ వ్యవహారం. పరిపక్వతకు కొండగుర్తు 'నేను' అన్న భావన నశించటం అన్నది. ఈ భావన ఉన్నంత కాలం ప్రకృతినుండి విడివడి స్వప్రకాశం పొందడు. అది నశించితే ప్రకృతి అతని వశంలో ఉంటుంది - అతడు ఈశ్వరవిభూతితో ప్రత్యక్షసంబంధం కలిగి ఉంటాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి . అతడు సాక్షాతూ ఈశ్వరుడి సంయోగంలో ఉంటాడు!

      ఈ గీతంలో ఈశ్వరుడు సాధకుడి సాధనను ప్రశంశిస్తూ కొన్ని మాటలు పలుకుతున్నాడు. కాని జీవుడు ఆ ప్రశంశలన్నిటికీ, 'ఈశ్వరా, నీవిచ్చినదే‌ కదా' అని వినయంగా బదులిస్తున్నాడు.

      జాగ్రత్తగా గమనించితే ఆ ఈశ్వరుడి ప్రశంశా పూర్వకమైన ప్రశ్నలలో మొదటినుండీ సాధకుడిని, 'నీవు', 'నీకు' అంటూ‌ సంబోధించటం‌ కనిపిస్తుంది. కాని జీవుడి సమాధానంలో ఎక్కడా 'నేను' అన్న భావన వెలువడదు. సాధకుడు 'నేను' అన్న భావనను దూరం పెట్టాడని అమోదించి ఈశ్వరుడు కూడా క్రమంగా అటువంటి నీవు/నీకు అన్న మాటలతో ప్రశ్నించడు.

      చివరగా ఈశ్వరుడు మెచ్చి 'గడితేరావు పో' అంటాడు. గడితేరటం అంటే (సాధనలో) చివరిస్థితికి వచ్చేయటం. దీని భావం జీవుడి మనస్సు 'దగ్ధబీజం' ఐపోయింది (కాలిన విత్తనం ఎలా ఇంక ఎట్టి పరిస్థితిలోనూ మొలకెత్తదో, లాగే సాధలో పక్వమైన మనస్సులో‌ ప్రకృతిసంబంధమైన 'నేను' అనే భావం ఇంక ఎప్పటికీ‌ రాదు) అదే సాధనకు చివరి మెట్టు - స్థూలంగా ఫలమూ అదే.

      ఇలా ఈశ్వరుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ,ఉత్తమ సాధకుడు ఈశ్వరుడి పరీక్షలో ఉత్తీర్ణుడై, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్లు ఈశ్వర తత్త్వంలో లీనం అవుతున్నాడు. ఇదీ ఈ‌ గీతం చెబుతున్నది.

      మీ మరొక సందేహం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నువ్వు అంటాం‌ కదా అలా ఈశ్వరానుగ్రహాన్ని పొందిన వాణ్ణీ నువ్వు అనవచ్చునా అన్నది. లోకంలో జన్మనిచ్చిన తల్లిని నువ్వు అనటం సర్వేసర్వత్రా కనిపిస్తోంది. అలాగే బంధువుల్లో కొందరిని కొందరు నువ్వు అనటం చూస్తున్నాం కూడా. కారణం ఒక్కటే. అత్యంత ఆత్మీయమైన వ్యక్తిని నువ్వు అనటంలో ఒక అనిర్వచనీయమైన తృప్తి ఉంది. ఈశ్వరుడికంటే ఆత్మీయులెవ్వరు? అందుకని దేవుణ్ణి నువ్వనటం‌ సాధారణమే.

      ఈశ్వరానుగ్రహం పొందిన మనిషిపై సాధారణంగా జనం‌ గౌరవం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని జనం మీరు అనటం‌ సాధారణం. భక్తీ,ఆత్మీయతా చాలా గొప్పగా ఉన్న సందర్భాల్లో అటువంటి వారినీ కొందరు నువ్వు అనటం అనిదంపూర్వం‌ కాదు. అది తప్పు కూడా కాదు.

      మీ సందేహాలు తీరాయని ఆశిస్తున్నాను.

      తొలగించండి
    2. సమాధానానికి థాంక్సండీ. ఈ కవిత ఈశ్వరునికి జీవునికి మధ్య సంభాషణ (Q&A) అన్న విషయం నాకు అర్ధం కాకపోవడమే నా సందేహానికి కారణం.

      ఈశ్వరుడు క్రమంగా "నీవు" అనే పదప్రయోగం మానడం వెనుక మీరు వాడిన లాజిక్ గొప్పగా ఉంది.

      తొలగించండి
    3. జై గారు నాస్తికులు కాబోలు,
      ఈ భక్తుని విచికిత్స నచ్చుట చిత్రమే!

      తొలగించండి
    4. హరిబాబు గారూ,

      జై గారు ఆస్తికులా నాస్తికులా అన్నది వేరే విషయం. ఆయన ప్రశ్న ఉచితంగా ఉన్నది కాబట్టి సమాధానం ఇచ్చానండి. అటువంటి సందేహం ఇతరులకూ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ సదుపాయంగా ఉండాలని వివరణ ఇవ్వటం జరిగింది. ఈ విషయం స్పష్టంగానే చెప్పి మరీ‌ నా సమాధానం వ్రాసాను.

      అథ్యాత్మిక కవిత్వం నచ్చే వారిలో అందరూ‌ ఆస్తికులు కారు. అలాగే అటువంటి కవిత్వం చదివి ఎవరైనా ఆస్తికులుగా మారతారా అన్న దానికి జవాబు చెప్పలేం కూడా. రవీంద్రుని గీతాంజలి నచ్చిన వారిలో ఆస్తికులే కాదు పరమనాస్తికులూ‌ ఉన్నారని నాకు స్వానుభవంగా తెలుసును.

      సంగతమైన ప్రశ్నలకు సమాధానం తప్పక ఇస్తాను. ఐతే కొన్ని కొన్ని సందర్భాల్లో నా పూర్వానుభవాలు సమాధానాన్ని ఇవ్వనివ్వకపోవటం‌ జరగవచ్చును - ముఖ్యంగా ప్రశ్న అడిగే వారి ఉద్దేశం పట్ల నాకు నమ్మకం కుదరని పక్షంలో. జైగారు నిజాయితీగానే అడిగారని భావించి జవాబు ఇచ్చాను. వారి వ్యక్తిగత విశ్వాసాలతో నిమిత్తం లేదు నాకు.

      తొలగించండి
    5. మాస్టారూ & హరిబాబు గారూ, నేను నాస్తికుడినే అయినా నాకు వివిధ మతాల/ధర్మాల స్వభావం అర్ధం చేసుకోవడం మీద చాలా ఆసక్తి. ముఖ్యంగా హిందూ మతం (సనాతన ధర్మం అనడం సబబేమో) అనేక వైవిధ్యతలతో కూడుకుని ఉండడం చేత లోతుగా వెళ్ళితే ఎంతో నేర్చుకొవోచ్చని నా ఉద్దేశ్యం.

      తొలగించండి
    6. జై గారికి,
      ద్వేషం,వెక్కిరింత లేని ఆసక్తి చాలా మంచిదే!నేను కూడా మీ ఆస్క్తి పట్ల వెక్కిరింతగా అడగలేదు,కొంచెం సరదా కుతూహలం అంతే:-)
      నా మనస్తత్వం మీకూ కొంత బోధపడే ఉంటుంది.ఎదటివాళ్ళు మొండిగా నెగటివ్ ధోరణిలో పదే పదే విసిగిస్తున్నప్పుడు తప్ప నాకుగా నేను ఎవ్వరిపట్లా నెగటివ్ ధోరణిలో మాట తూలను.
      స్వస్తి!

      తొలగించండి
    7. హరిబాబు,గారూ ఒకవేళ నేనే అపార్థం చేసుకున్నానేమో మిమ్మల్ని! మీరే నన్ను మన్నించాలి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.