15, మార్చి 2016, మంగళవారం

కాలము - దైవము


కం. కాలము తప్పులు చేయదు
కాలము తానొకట తప్పు కాచదు మరియా
కాలమున కొదగ  నట్టిది
యే లోకంబునను గాని యేర్పడ దెపుడున్

కం. దైవము తప్పులు చేయదు
దైవము తానొకట కాచ దలచదు తప్పుల్

దైవమున కొదగ నట్టిది
భావింపను గూడ వలనుపడదీ సృష్టిన్

కం. తనవస్తువు పరవస్తువు
తనవారలు బయటివారు తనసౌఖ్యంబున్
తనహితమును పరహితమును
కనుగొన కాలమున కేమి కల దించుకయున్

కం. తనవస్తువు పరవస్తువు
తనవారలు బయటివారు తనసౌఖ్యంబున్
తనహితమును పరహితమును
కనుగొన  దైవమున కేమి కల దించుకయున్

కం. సర్వము తనలో‌ పొడమును
సర్వము తనయందు నిలచి సంవృధ్ధియగున్
సర్వము తనయం దడగును
సర్వము విశ్వమున కాలశాసిత మనగన్

కం. సర్వము తనలో‌ పొడమును
సర్వము తనయందు నిలచి సంవృధ్ధియగున్
సర్వము తనయం దడగును
సర్వము విశ్వమున  దైవశాసిత మనగన్

కం. మొదలిదియని లేనట్టిది
తుదియను నది కూడ లేక తోచెడు నదియున్
సదమల చిద్రూపంబగు
నదియును కాలంబు సర్వ మందే‌ కలుగున్

కం. మొదలిదియని లేనట్టిది
తుదియను నది కూడ లేక తోచెడు నదియున్
సదమల చిద్రూపంబగు
నదియును దైవంబు సర్వ మదియే నడపున్


కం. నిరుపాధికమగు కాలము
సురవరులకు తెలియరాని సొంపున నుండన్
నరులకు తెలియగ వశమా
నిరవధికము దాని నెఱుగ నేర్చుట గలదే

కం. నిరుపాధికమగు దైవము
సురవరులకు తెలియరాని సొంపున నుండన్
నరులకు తెలియగ వశమా
నిరవధికము దాని నెఱుగ నేర్చుట గలదే

కం. చాల విధంబుల నొకటగు
పోలికగా రెండు నిట్లు బుధ్ధికి తోచన్

మేలు వివేచన చేయగ
కాలము దైవంబు నొకటిగా కనుపట్టున్


కం. దైవము కాలము నొక్కటి
కావున పరమాత్ముడనెను కాలోస్మి యటం
చీ విధమంతము చక్కగ
భావించిన కలుగు ఫలము పరమశుభంబౌ.
 

తే. కనుక కాలస్వరూపుడౌ ఘనుడ రామ
వినుతి చేసెద నేవేళ వేదవేద్య
మనసు నీనుండి మరలని మంచివరము
నాకు దయచేయ వయ్య యీనాడు నీవు