16, ఏప్రిల్ 2016, శనివారం

పరమపదసోపానపటము









    పరమపదసోపానపటన పరుగులిడువాడా
    మరలమరల ముందువెనుకల తిరిగెడు నరుడా

    పరమసుందరమైన పటమున నిలచినావయ్యా
    పరమపదము చేరుదాక సాగిపోవయ్యా
    పరమపదము చేరుదాక సాగిపోవయ్యా

    నిత్యక్రీడా ప్రకటనశీలము నిజముగ నీపటము
    నిరపమానంబైన పట నీవు నేను తిరుగుపటము
    పాపములు పలువిధములైన పాములై కనుపించు పటము
    పుణ్యములు పైకెత్తు నిచ్చెన మెట్లుగా కనిపించు పటము

    పంటపండేదాక పావులు పరుగులెత్తే చిత్రపటము
    ఆడి అలయుచు నున్న గాని ఆపనీయని చిత్రపటము
    సృష్టికే ప్రతిసృష్టివంటి యాటచూపే చిత్రపటము
    జీవుడా నీపరుగు నీదే చేరుకొమ్మను చిత్రపటము

    ఎంతమంచిది పరమపదసోపానపటమో తెలిసినా
    ఎంతసరసమైన యాటకు వేదికో యిది తెలిసెనా
    ఎంతచిన్న పిల్లలైనా ఎంత పండుముసలులైనా
    పంతగించియాడు ఆట మర్మమేమో తెలిసెనా





నిజానికి శర్మగారి టపా క్రింద ఒక వ్యాఖ్యగా మొదలు పెడితే అది ఒక పెద్ద పాట ఐపోయింది. సరేలెమ్మని దాన్నే ఒక టపాగా వేస్తున్నాను. అందుచేత ఈ‌ పాటకు ప్రేరణనిచ్చిన ఘనత శర్మగారిదే. ఇకపోతే ఈ‌పాటలో సరుకేమన్నా ఉంటే అది వ్రాయించిన ఈశ్వరుడి ఘనతయే కాని నాదేమీ లేదు.



1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.