3, మే 2023, బుధవారం

పాహి రామచంద్ర (రాకమచర్ల వేంకటదాసు కీర్తన)

పాహి రామచంద్ర - సదా మాం - పాహి రామచంద్ర
పాహిపాహి పరమేశ బుధావన
మోహనరూపక మునిజనసేవిత
 
ధరణిజహృదయేశ - రాఘవ - తరణిసుప్రకాశ
పరమాదర భూసురపరిపాలక
శరణాగతజన దురితవిదూర
 
బోధసహితరూప - ధార్మిక - పుణ్యసత్యభూప
గాధిసుతాధ్వరకలిత సుబోధ వి
రాధకహర ఘనరమ్యశరీర
 
దీననివహపోష - రాఘవ - దీపితసంతోష
వానరనాయక వరదాయకఘన
మానితసుందర మానసవల్లభ
 
పురహరనుతనామ - రాఘవ - పుణ్యసార్వభౌమ
కరుణాకర రాకమచర్లాధిప
పరహితకారణ దురితవిదూర

ఇదొక అందమైన రాకమచర్లవారి కీర్తన. శుధ్దపాఠం పైన చెప్పినట్లుగా ఉంటుంది కాని గానం చేసేటప్పుడు భజనకు అనుకూలంగా విరుపులు ఉండాలి. పాడే విధానంలో ఇది ఎలా ఉంటుందో చూదాం. రాకచర్లవారు యతిప్రాసలను పాటించారని గమనించండి. ప్రాసమైత్రి స్పష్టంగానే తెలుస్తూ ఉంటుంది పల్లవిలోనూ చరణాల్లోనూ ప్రతిపాదంలోనూ రెండవ అక్షరంలో. యతిమైత్రి చేసిన చోట్లను క్రీగీతతో గుర్తించి చూపుతున్నాను పాఠకుల సౌకర్యార్ధం. ఒకచోట మాత్రం యతిమైత్రిని పాటించలేదు. సాధ్యమైనంతవరకూ కీర్తన ఆసాంతం యతిప్రాసలను పాటించారు. పాడే విధానంలో కాలఖండాల విరుపులను అడ్డుగీతతో సూచించాను. ఒక్కొక్కసారి ఒక కాలఖండంలో ఒక అక్షరం మాత్రమే ఉండటం గమనించండి. కాలఖండ నిడివి ఈకీర్తనలో నాలుగు మాత్రలు. ఒక్క అక్షరంగా ఉన్న చోట కూడా నాలుగు మాత్రల నిడివితో పాడవలసి ఉంటుంది. తాళ ప్రమాణం పరంగా చూస్తే ఎనిమిదేసి మాత్రల నిడివి మీద నడుస్తున్నదని అనిపిస్తున్నది. విద్వాంసులకు తెలుస్తుంది.

ఇకపోతే ఈకీర్తనలో దురితవిదూరా అన్న సంబోధన పునరుక్తి ఐనది - స్వల్పదోషం - అదికూడా వాడినవిధానంలో ఉన్న బేధం వల్ల తొలగిపోతున్నది.

పాహీ - రామచం - ద్రా -- సదా మాం -- పాహీ - రామచం - ద్రా
పాహిపాహి పర - మేశ బు - ధావన
మోహన - రూపక - మునిజన - సేవిత
 
రణిజ - హృదయే - శా -- రాఘవ -- రణిసుప్రకా - శా
పరమా - దర భూ - సురపరి - పాలక
శరణా - గతజన దురితవి - దూరా
 
బోధస - హితరూ- పా -- ధార్మిక -- పుణ్యసత్యభూ - పా
గాధిసు - తాధ్వర - లిత సు - బోధ వి
రాధక - హర ఘన - మ్యశ - రీరా
 
దీనని - వహపో - షా -- రాఘవ -- దీపితసంతో - షా
వానర - నాయక రదా - యకఘన
మానిత - సుందర - మానస- వల్లభ
 
పురహర - నుతనా - మా -- రాఘవ -- పుణ్యసార్వభౌ - మా
రుణా - కర రా - మచ - ర్లాధిప
పరహిత - కారణ - దురితవి - దూరా

ఎవరైనా ఈకీర్తన ఆడియో ఎక్కడైనా కనుక లభిస్తే సూచించగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.