24, మే 2023, బుధవారం

హరికాంత

హరికాంత.
హరి రామాకృతి నారావణునిం 
పరిమార్చన్ నరభావంబు గొనన్ 
సిరి నీకై వెస సీతాసతిగా 
యరుదెంచెం గద యబ్జాక్ష భళీ


ఓదేవా శ్రీహరీ నీవు రావణుణ్ణి సంహరించటానికి సంకల్పించావు. దానికి గాను నీవు నరభావాన్ని స్వీకరించావు. రాముడివై జన్మించావు.

నీకార్యక్రమంలో పాలుపంచుకోవఠటానికై నీయర్ధాంగి లక్ష్మీ దేవి కూడా వెంటనే సంకల్పించింది. తాను సీతాసతిగా అవతరించింది. నీచేత రావణవధ చేయించింది. 

ఇదెంతో భలేగా ఉంది. ఎందుకంటే రావణుడి బలహీనతనే పావుగా వాడుకొని మీరు మంచి లీలావినోదం చేసారు కదా.

(హరికాంతవృత్త లక్షణచర్చ.  ఈ హరికాంత ఒక అందమైన వృత్తం. ఈ వృత్తానికి స-భ-త-వ అనేది గణక్రమం. పాదానికి పదకొండు అక్షరాలు. వృత్తం కాబట్టి ప్రాస నియమం తప్పదు. 7వ స్థానంపైన యతిమైత్రి చేయాలి. పాదం ఉత్తరార్ధం త-వ అని గణక్రమం ఉన్నా నిజానికి అది గగ-స అన్నట్లుగా అనిపిస్తుంది. అలా చూస్తే పాదంలో నాలుగు చతుర్మాత్రా గణాలు వస్తున్నాయి. అందుచేత ఈవృత్తానికి చతురస్రగతిలో కనిపిస్తూ ఉంటుంది నడక. యతిస్థానం వద్ద వృత్తపాదం మాత్రాపరంగా సమద్విఖండితం అవుతుంది 8+8 మాత్రలుగా.) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.