4, మే 2023, గురువారం

ధరణీగర్భసముద్భవసీతాతరుణీ

ధరణీగర్భసముద్భవసీతాతరుణీహృదయాకాశమున
పరిపూర్ణసుధాకరబింబంబన బ్రకాశించు రఘునందన

పరిపాలయమాం కరుణాజలధే మరువక నిను సేవించేము
కరివరదుడగు శ్రీహరివని నిను గట్టిగ మదిలో నమ్మేము
సురగణనాయక శుభసంధాయక మరిమరి నిన్నే కొలిచేము
పరమాత్మా హరి దనుజవిదారక దురితవినాశక మ్రొక్కేము

నరనాథాగ్రణి రావణదైత్యవినాశక నిను సేవించేము
సరసీరుహభవ పశుపతి వాసవ సన్నుత నిన్నే నమ్మేము
పరమభక్తులకు వరములిత్తువని మరిమరి నిన్నే కొలిచేము
పరంధామ హరి మాకోరిక యపవర్గము నడుగుచు మ్రొక్కేము

నిరుపమసుగుణాకర నిరుపాధిక నిత్యము నిను సేవించేము
హరి నిను నమ్మిన జన్మపరంపర ఆగిపోవునని నమ్మేము
పరమయోగిగణహృదయోల్లాసుడవని నిను చక్కగ కొలిచేము
మరియిక పుట్టువులీయకు మాకని మరిమరి వేడుచు మ్రొక్కేము 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.