8, మే 2023, సోమవారం

శ్రీహరి స్మరణమే

శ్రీహరి స్మరణమే ధనము శ్రీహరి స్మరణమే సుఖము 
శ్రీహరి స్మరణమే శుభము శ్రీహరి స్మరణమే జయము 

శ్రీహరి స్మరణమే జీవులందరకు చింతల దీర్చే సాధనము
శ్రీహరి స్మరణమే సజ్జనులందరు చేయుదు రెప్పుడు నిత్యము
శ్రీహరి స్మరణమే ముముక్షువులకు మోహప్రశమనౌషధము
శ్రీహరి స్మరణమే భవరోగమునకు సిధ్ధౌషధము పథ్యము 
 
శ్రీహరి స్మరణమే బ్రహ్మదేవుడు చేయుచుండు తానెప్పుడును 
శ్రీహరి స్మరణమే రామ రామ యని చేయుచుండు శివదేవుడు
శ్రీహరి స్మరణమే దిక్పాలకులును చేయుచుందురు నిత్యమును
శ్రీహరి స్మరణమే సకలలోకముల చెలగును రక్షాకవచముగ

శ్రీహరి స్మరణమే చేయనివారిల యూహకందదా సౌఖ్యము
శ్రీహరి స్మరణమే చేయువారలను చేరడు యముడెన్నడును
శ్రీహరి స్మరణమే చేయుట కంటెను చేయదగిన దేమున్నది
శ్రీహరి స్మరణమే చేయండి ఇక చెచ్చెర హరినే చేరండి