20, మే 2023, శనివారం

హరినామ మొకటి చాలు నంతే నయ్యా

హరినామ మొకటి చాలు నంతే నయ్యా
మరి యితరము లెందు కవి మరచిపొండయ్యా

హరినామధనము చాలు నంతేనయ్యా
మరి వెంటరాని ధనము మనకేలయ్యా

హరినామభజన చాలు నంతేనయ్యా
మరి నరులను కొలుచు కర్మ మనకేలయ్యా

హరినామ మొకటె మధుర మంతేనయ్యా
మరి వేరే మిఠాయిలు మనకేలయ్యా

హరినామ మొకటె సుఖద మంతేనయ్యా
మరి యితరసుఖము లెల్ల మనకేలయ్యా

హరినామము మరువరా దంతేనయ్యా
మరి యన్యము తలచుపని మనకేలయ్యా

హరేరామ యంటే చాలు నంతే నయ్యా
మరి వేరే మంత్రములు మనకేలయ్యా