మధ్యాక్కఱ.
నీముందు నిలబడి చెప్పుకొనవలె నిజములు కొన్ని
నీముందు నిలబడి చెప్పుకొనవలె నిందలు కొన్ని
నీముందు నిలబడి చెప్పుకొనవలె నేకోరునదియు
నీముందు నిలబడి యెపుడు చెప్పెద నిజముగ రామ
ఓ రామచంద్రప్రభో.
ఈలోకంలో బ్రతికిన నా బ్రతుకును గురించి నా గుండెలో గూడుకట్టకొన్న సంగతులను నీకు చెప్పుకోవాలి.
అదెప్పుడు జరిగేదీ నీవే చెప్పాలి.
నీముందు నిలబడి నేను నీతో చెప్పుకొనవలసిన నిజాలు కొన్నున్నాయి. అవి ఈలోకంలో మరెవరికీ చెప్పుకోలేను. చెప్ప ప్రయోజనం ఉండదు. అర్ధం చేసుకొనే ఓపికా తీరికా ఆసక్తీ ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు. అంత అనురక్తి ఎవరికీ ఉండదు నాపైన.
ఈలోకం పని నిజాలు తెలుసుకోవటం కాదు. నిందలు వేయటమే కదా. నీముందు నిలబడి అన్యాయంగా నానెత్తిన బడిన కొన్ని నిందలను గూర్చి నీకు చెప్పుకోవాలి. వాటిని ఈలోకంలోని జనంతో చెప్పుకోలేను కదా.
ఇంత బ్రతుకు బ్రతికి ఇంక నేను కోరుకొనేది ఏమిటో కూడా చెప్పుకోవాలి నీకు.
కానీ రామచంద్రప్రభో ఎప్పుడు నీముందు నేను నిలబడి నావిన్నపాలు అందించేది?
దయచేసి చెప్పు స్వామీ. ఎన్నడా భాగ్యం కలిగేది నాకు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.