14, మే 2023, ఆదివారం

నోరున్నదని పలుకాడ

మధ్యాక్కఱ.
నోరున్నదని పలుకాడ జనులకు కూరిమి తప్ప
వారు తిట్టిన భంగపడుట మనకేల భగవంతుడైన
శ్రీరామచంద్రుని పొగడి పలుకాడ శ్రీకరం బౌను
చేరదీయును స్వామి యన్నది గ్రహించి జీవించ వలయు
 

నోరున్నది కాబట్టి ఊరుకోలేక ఏదో ఒకటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం చుట్టూ‌ ఉన్నవారితో.
కాని మనమాటలు ఇతర జనులకు ఒప్పుదల కాకపోతే? వారితో మనకున్న కూరిమి చెడుతుంది!

కాకపోతే అని కాదు. నూటికి తొంభై మారులు ఇతరులకు మనలో తప్పుతోచే అవకాశం ఇచ్చే పరిస్థితి మనమాటలే కల్పిస్తూ ఉంటాయి.

అంతకంటే ఈనోటి దురదను తీర్చుకుందుకు మంచి ఉపాయం ఉంది.
 
శ్రీరామచంద్రుని పొగడండి.

అది శ్రీకరం.

చివరికి స్వామి మనని చేరదీసుకొనే సదవకాశాన్ని మనం అలా కలిగించుకోవచ్చును.

ఈవిషయం గ్రహించి జీవించాలి మనం.