30, మే 2023, మంగళవారం

మీరేమీ చేసెదరయ్య మీరాముని కొఱకు

మీరేమీ చేసెదరయ్య మీరాముని కొఱకు వా
క్శూరులేనా భక్తులారా మీరు

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
మీరేమీ యడుగకున్నను మీకిచ్చును సిరులు
ఆరాము డీయని దేమియు నగుపడదే మాకు ముద
మారంగ రాముని కీయగ నాలోచించుటకు

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
దారి చూపించెను మీకు ధర్మ మిది యనుచు
దారిని తప్పని శీలము దప్ప మేమేమి యిక
కూరిమితోడను హరికి  ధారపోసేము

మీరేమి యిచ్చేరయ్య మీరఘురామునకు వాడు
మీరడిగినారని ప్రేమగ మీకిచ్చును ముక్తి
ఆరాము డిచ్చెడు మోక్ష మఖిలోన్నతపదము మేము
నారాయణున కేమిత్తుము నమస్కారములే