27, మే 2023, శనివారం

నీయండ చాలును కోదండరామా

నీయండ చాలును కోదండరామా మాయను గెలిచెద కోదండరామా
ఆయపవర్గము కోదండరామా న్యాయముగ నిమ్ము కోదండరామా

నీమముగ నేను కోదండరామా నీనామస్మరణము కోదండరామా
యేమరక చేయుదు కోదండరామా యీమాటకును దప్ప కోదండరామా
సామవాక్యంబుల కోదండరామా చక్కబడక యున్న కోదండరామా
కామాదిరిపులను కోదండరామా కట్టికొట్టెద నింక కోదండరామా

ఎంతవారికైన కోదండరామా చింతలు దప్పవు కోదండరామా
చింతలేని వారు కోదండరామా శ్రీరామభక్తులె కోదండరామా
అంతకుని భటులు కోదండరామా యెంతబెదిరించిన కోదండరామా
సుంతైన బెదరక కోదండరామా జోరుగ నిను బిల్తు కోదండరామా

కలిమాయ గిలిమాయ కోదండరామా ఖాతరుసేయ కోదండరామా
యిలమీద తిరుగుచు కోదండరామా యెల్లవేళల నిన్నె కోదండరామా
తిలకించ నందరు కోదండరామా తీరుగ పొగడెద కోదంద రామా
నలుదెసల నీకీర్తి కోదండరామా నయమొప్ప చాటెద కోదండరామా