14, మే 2023, ఆదివారం

శ్రీరఘురామ పాహి యని వేడుచు చేరిన

మధ్యాక్కఱ.
శ్రీరఘురామ పాహి యని వేడుచు చేరిన నెట్టి
వారును రామచంద్రు దయ పొంది యవశ్యము ధన్యు
లైరహియింతురు కాని యెన్నడున్ కారు దీనులని
ధారుణి నెల్లవారు గ్రహియించుట తప్పక మేలు

భూమిమీద నున్న అందరూ తప్పక తమ మేలు కోరి గ్రహించవలసిన సత్యం ఒకటుంది.
శ్రీరఘురామా పాహి పాహి అని ఎవరైనా వేడుతూ రాముణ్ణి చేరుకున్నారా వాళ్ళు తప్పకుండా ధన్యులే.
రాముడు శరణన్నవారిని వారు ఎలాంటి వారైనా తిరస్కరించినదే లేదు. ఉండదు కూడా.
అందుచేత రాముణ్ణి పాహీ అన్నానండీ ఆయన శరణం ఇవ్వలేదు అని దీనులై ఎవరూ పలికే అవకాశమే‌ లేదు.
ఈ విషయం గ్రహించితే, గ్రహించి రాముణ్ణి పాహి అని శరణు వేడితే మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుంది.