6, మే 2023, శనివారం

హరేరామయని స్మరించరా

హరేరామయని స్మరించరా హరేకృష్ణయని స్మరించరా
స్మరించవలెనని గ్రహించరా స్మరించి హరిని తరించరా

హరిసంకీర్తన పరులను గూడి పరమభక్తితో పాడరా
హరినామామృత మొక్కటిచాలని యందరెఱుగగ చాటరా
పరాత్పరుని శుభనామము కన్నను తరణోపాయము లేదురా
నిరంతరము హరినామము చేయుచు పరాభక్తిని చాటరా
 
సతతము శ్రీహరి సంకీర్తనమే చాలని మనసున నెంచరా
ధృతిమంతుడవై హరిసేవలలో తిన్నగ నిలచి యుండరా
అతిశయించ సద్భక్తి నిరంతర మానందముగా నుండరా
వ్రతముగ శ్రీహరినామామృతమును ప్రతిక్షణంబును గ్రోలరా

అవినయపరులను గూడక నిత్యము హరిసేవకులను చేరరా
భవతారకమని రామనామమును వదలక పెదవుల నుంచరా
వివిధోపాయము లెందుకు మనకని వెన్నును భజనల నుండరా
అవలీలగ భవచక్రము విరచి హరిసాన్నిధ్యము చేరరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.