20, మే 2023, శనివారం

విందులు చేసే నందరి కనులకు

విందులు చేసే నందరి కనులకు సుందరరాముడు మధుర
మందహాసమృదుచంద్రికలతో మసలే రాముడు

ముద్దులుపెట్టే ముగ్గురుతల్లుల ముందర రాముడు చాలా
విద్దెము చూపే నింటికి మిక్కిలి వెలుగౌ రాముడు
పెద్దలకాళ్ళకు మ్రొక్కుట నేర్చెను ముద్దులరాముడు చాలా
ఒద్దిక కలిగిన మంచిబాలుడై యుండెడి రాముడు

అన్నదమ్ములా నలుగురు నొకటై నాడుచు నుండగను చాలా
కన్నులపండువ కాగా నరపతి కలియుచు నాడును
అన్నులమిన్నలు రాణులందరకు నానందము గాను రాముడు
క్రొన్నెలరాతి తలముల నాడును వెన్నెలబాలుండై

కైకమ్మకు తన భరతుని కంటెను గాఢము రామునిపై ప్రేమ
లోకోత్తరుడు మారాము డది మీకే మెఱుకనును
అకలి యంటే‌ రాముడు కైక మ్మల్లల్లాడేను రాముడు కైకా
నాకొడుకా నీకొడుకా యనుచును నవ్వును కౌసల్య