4, మే 2023, గురువారం

హరి యేల నరుడాయె నమ్మలారా

హరి యేల నరుడాయె నమ్మలారా శ్రీ
హరి యేల నరుడాయె నయ్యలారా
 
హరియే లేడని పలికే అతితెలివిగాండ్లకు
సరియైన శిక్షవేయ నరుడాయెను
హరితో వైరము నెఱపే అసురవీరుల ద్రుంచ
సరియైన యదనెఱిగి నరుడాయెను 

దారితప్పి తిరుగువారి దండించవలె గాన
నారాయణుండు నేడు నరుడాయెను
దారి తెలియలేక తిరుగు వారికొక చక్కనైన
దారిచూప శ్రీనాథుడు ధరకువచ్చెను

తామసులను శిక్షించి ధర్మాత్ముల రక్షించ
స్వామి రామనరేంద్రుడై జన్మమెత్తెను
రామనామదివ్యజపపరాయణులౌ నరులకు
నామమిషను ముక్తినీయ నరుడాయెను