25, మే 2023, గురువారం

భాగ్యమనగ వేరొక టున్నే

కం. ఎవరున్నను లేకున్నను

రవికులపతి నీవు కలవు రామా తోడై

భువనేశ్వర నావాడవు

వివరింపగ భాగ్యమనగ వేరొక టున్నే


ఓ రామచంద్రప్రభో.

ఎవరికి ఎవరు తోడు  లోకంలో.

బంధుమిత్రులు పరివారమూ తోడు అనుకుంటారు కాని అందరూ వారివారి యిహలోకయాత్రలో భాగంగా విధివిలాసంగా కొంతకొంతగా తోడుగా ఉన్నట్లు కనిపించేవారే. నిలకడగా ఎవరూ తోడు కారు. కాలేరు.

నమ్ముకున్న దేవీదేవతలు కూడా సృష్టివిలాసంలో భాగమే. మనిషి శతాయుప్రమాణజీవి యైతే దేవతానీకం కల్పాయుప్రమాణం కలవారు.

అహమాదిర్హి దేవానామ్ అన్న నీవే అందరు జీవులకూ నమ్మదగిన తోడు.

ఈభువనాలు అన్నింటికీ అధిపతివి ఐన నీతోడే కదా గొప్పదీ నిజమైనదీ యైన తోడు.

అటువంటి నీవు రవికులపతివైన రాముడవు నాకు తోడుగా ఉన్నావు.

పరామర్శించి చూస్తే యింతకన్నా మహద్భాగ్యం మరొకటి ఉంటుందా?